సుప్రీంకోర్టు దెబ్బకు ఎస్‌బీఐ దిగొచ్చింది. వివరాల సమర్పణకు గడువు పెంచేది లేదని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పడంతో.. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను మంగళవారం సాయంత్రం ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. ఇక, ఇప్పుడు ఆ వివరాలను ప్రజాబాహుళ్యం ముందు ఉంచాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంది. సుప్రీం ఆదేశాల మేరకు శుక్రవారం (మార్చి 15) సాయంత్రం 5 గంటల్లోగా ఎన్నికల కమిషన్ ఆ వివరాలనుతన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించాల్సి ఉంది. కాగా, ఎన్నికల బాండ్ల వివరాలను ఈసీకి సమర్పించాలంటూ ఫిబ్రవరి 15న తాము ఇచ్చిన తీర్పు అమలుపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్‌బీఐ చైర్మన్, ఎండీలను సుప్రీంకోర్టు సోమవారం విచారణ సందర్భంగా ఆదేశించిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వారి అఫిడవిట్లు సిద్ధమయ్యాయిగానీ, ఇంకా కోర్టుకు సమర్పించలేదు. మరోవైపు.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ‘ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్’ కోరాలంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చీఫ్ ఆదీష్ సి అగర్వాలా... రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళవారం ఒక లేఖ రాశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ అంశంపై మరోసారి విచారణ జరిపేదాకా తీర్పు అమల్లోకి రాకుండా చూడాలని అందులో కోరారు. వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ల పేర్లను బయటపెట్టడం వల్ల ఆయా సంస్థలు ఇబ్బందిపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు తక్కువ విరాళాలిచ్చిన కంపెనీలను పార్టీలు చిన్నచూపు చూసి, హింసించే ప్రమాదం ఉందని.. తద్వారా విరాళాల రాక తగ్గిపోయే ముప్పుందని అంచనా వేశారు. సుప్రీం తీర్పు గతకాలానికి కూడా వర్తింపజేస్తూ సున్నితమైన సమాచారాన్ని విడుదల చేస్తే.. అంతర్జాతీయ సమాజంలో అది మన దేశ పరువును దెబ్బతీస్తుందన్నారు.