వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కనీసం 160 అసెంబ్లీ సీట్లు సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. విభేదాలను పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ... ప్రతి సీటూ ముఖ్యమేనని.. వాటిని సాధించడానికి శ్రమించాలని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. టీడీపీ క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయుల్లో వివిధ బాధ్యతల్లో ఉన్న 56 వేల మంది నేతలతో మంగళవారం సాయంత్రం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు, వర్తమాన రాజకీయ అంశాలపై మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ గెలుపు చారిత్రక అవసరమన్నారు. పోలింగ్ ముగిసేవరకూ పార్టీ నేతలు, కార్యకర్తలు విశ్రమించరాదని సూచించారు. ‘జగన్ విధ్వంస పాలన రాష్ట్రాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లింది. ప్రతి రంగంలో పతనమే. దోచుకుని జేబులు నింపుకోవడం తప్ప అభివృద్ధి గురించి పట్టించుకున్న నాథుడు లేడు. ఏపీని మళ్లీ పైకి లేపడానికే మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి’ అని ఉద్ఘాటించారు. మూడు పార్టీల పొత్తు జగన్‌ను ఓడించడానికి కాదు.. రాష్ట్రాన్ని గెలిపించడానికేనన్నారు. ఆంధ్ర విస్తృత ప్రయోజనాల కోసమే 3 పార్టీలు చేతులు కలిపాయని చెప్పారు. ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరి చేస్తున్న పర్యటనలకు మంచి స్పందన లభిస్తోందని, ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకునే వరకూ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.