ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. ఏ పార్టీ ఎన్ని స్థానల్లో పోటీ చేస్తాయనే అంశంపైనా క్లారిటీ వచ్చేసింది. టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్‌సభ స్థానాల్లో బరిలోకి దిగాలని నిర్ణయించారు. జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది. అయితే టీడీపీ జనసేనలకు కలిసి ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించాయి.. ఇప్పుడు సీట్ల పంపకాలు పూర్తి కావడంతో త్వరలోనే అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే బీజేపీ, జనసేనకు కేటాయించే స్థానాలపై క్లారిటీ రావాల్సి ఉంది. మూడు పార్టీలు ఇప్పుడు అదే అంశంపై ఫోకస్ పెట్టాయి.
ఈ క్రమంలో పొత్తులో భాగంగా బీజేపీ ఏపీలో పోటీచేయబోయే స్థానాలపై చర్చ జరుగుతోంది. ఈ స్థానాలనుంచి పోటీలో దింపే అభ్యర్థుల జాబితా కూడా దాదాపుగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే.. శ్రీకాకుళం, పాడేరు, విశాఖ ఉత్తరం, అనపర్తి, పి.గన్నవరం, కైకలూరు, గుంటూరు వెస్ట్, మదనపల్లె, రాజంపేట, జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్లు స్థానాల నుంచి అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
బీజేపీ పోటీ చేస్తారనుకునే స్థానాల్లో.. విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్‌రాజు, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, పి.గన్నవరం నుంచి అయ్యాజీ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అలాగే మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తనకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. బీజేపీ పార్టీ సీనియర్ నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి (తపన ఫౌండేషన్) కూడా అసెంబ్లీకి పోటీ చేయాలనకుంటున్నారట. కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ అల్లుడు సాయిలోకేష్ మదనపల్లె లేదా రాజంపేట నుంచి బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
లోక్‌సభ సీట్ల విషయానికి వస్తే.. ఆరు నియోజకవర్గాల్లో రాజమహేంద్రవరం నుంచి పురందేశ్వరి, తిరుపతి నుంచి మునిసుబ్రహ్మణ్యం, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు, అరకు నుంచి కొత్తపల్లి గీతల పేర్లు వినిపిస్తున్నాయి. మిగిలిన స్థానాలపై క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీ అధిష్టానం అభ్యర్థుల ఎంపికై కసరత్తు పూర్తి చేసిందని.. త్వరలోనే పేర్లు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇటు టీడీపీ, జనసేన పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపిక పనిలో ఉన్నాయి. త్వరగా అభ్యర్థుల్ని, మేనిఫెస్టోను ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని మూడు పార్టీలు భావిస్తున్నాయి. అలాగే టీడీపీ జనసేన బీజేపీల మధ్య సమన్వయం చేసుకుని.. ఆయా నియోజకవర్గాల్లో ముందుకు సాగాలని భావిస్తున్నారు. అలాగే ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే సభకు ప్రధాని మోదీ హాజరుకానుండటం ఆసక్తికరంగా మారింది.