తెలుగు దేశం, జనసేన పార్టీ అధిష్టానాలు నిర్ణయించిన ప్రకారం ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా బడేటి చంటి పోటీ చేస్తున్నారని ఆయన విజయానికి సమిష్టిగా కృషి చేయాలని జనసేన తాడేపల్లి గూడెం ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అధిష్టానం నుంచి పిలుపు రాకపోతే ఈనెల 14వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని జనసేన ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి అప్పలనాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పవన్ కల్యాణ్ బొలిశెట్టి శ్రీనివాస్‌ను అప్పల నాయుడుతో మాట్లాడమని చెప్పడంతో మంగళవారం ఏలూరు వచ్చి ఆయనతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జనసేన – టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం అప్పలనాయుడుకు మంచి ప్రాధాన్యం లభిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో అప్పలనాయుడు నిరాహార దీక్షను విరమించినట్టు ప్రకటిం చారు. జనసేన నాయకులు బి.వి.రాఘవయ్యచౌదరి, నాగిరెడ్డి కాశీ నరేష్, ఒబిలిశెట్టి శ్రావణ కుమార్ గుప్త, సిరిపల్లి ప్రసాద్, బొత్స మధు, రెడ్డి గౌరీశంకర్ ఉన్నారు.