ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ ఇంత బాగుంటుందని అనుకోలేదు.. విదేశీయురాలి సంతోషం

national |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2024, 09:41 PM

మన దేశాన్ని, మన దేశంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను చూసేందుకు ప్రతీ రోజు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు వస్తూనే ఉంటారు. ఇక్కడికి వచ్చి భారత అందాలను ఆస్వాదిస్తూ ఇక్కడే స్థిరపడిపోయినవారు చాలా మందే ఉంటారు. ఇక మన ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఇతర పద్దతులు సహా ఎన్నో నచ్చి.. వాటి గురించి పరిశోధనలు చేసిన వారు కూడా ఉంటారు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం భారత్ అంటే చిన్నచూపు ఉంటుంది. అలాంటి వాళ్లలో ఒకరు ప్రస్తుతం మన దేశంలో పర్యటించి తాము భారత్ గురించి విన్నది, అనుకున్నది తప్పు అని గ్రహించారు. భారత్‌లో పర్యటించడం ఒక అద్భుత అనుభూతి అంటూ కితాబిచ్చారు.


ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు జీవిస్తున్నారు. ఇక ఎన్నో దేశాల నుంచి భారత్‌లో పర్యటించేందుకు నిత్యం ఎంతో మంది విదేశీయులు వస్తూ ఉంటారు. భారత్‌లో ఉన్న కళలు, కట్టడాలు, వారసత్వ సంపదలు, చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. కానీ కొన్ని దేశాల్లో భారత్ గురించి ఇప్పటికే మంచి అభిప్రాయం లేదని అప్పుడప్పుడూ తెలుస్తూ ఉంటుంది. భారత్ అంటే ఒక పేద దేశమని.. అక్కడ నివసించే ప్రజలు మురికివాడల్లో జీవనం సాగిస్తారనే అపోహలు ఎన్నో ఉన్నాయి. అయితే భారత్‌లో పర్యటించి ఇక్కడి అద్భుత దృశ్యాలను చూస్తేగానీ వారికి అర్థం కాదు భారత గొప్పదనం ఏంటో, భారత్ ఎంత అద్భుతంగా ఉంటుందో. తాజాగా ఓ విదేశీయుడు తన తల్లితో కలిసి తొలిసారి భారత్‌లో పర్యటించి మంత్ర ముగ్ధులు అయ్యారు. తమకు తెలిసిన భారత దేశానికి, తాము తిరిగిన భారతదేశానికి ఎంతో తేడా ఉందని తాజాగా ట్విటర్ వేదికగా ఓ భారీ పోస్ట్ పెట్టారు.


ట్రూ కాలర్‌ సంస్థలో ప్రొడక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సైమన్ కొపెక్ ఇటీవల తన తల్లితో కలిసి భారత్‌లో పర్యటించారు. ఇక వారు భారత్‌లో పర్యటించడం ఒక గొప్ప అనుభూతి అంటూ ఆయన ట్విటర్ వేదికగా ఒక భారీ పోస్ట్ పెట్టారు. భారత్‌లో చూసిన ప్రముఖ పర్యాటక ప్రదేశాల గురించి వివరిస్తూ.. కొన్ని ఫోటోలను కూడా పంచుకున్నారు. అయితే తన తల్లి భారత పర్యటనలో ఎంతో అనుభూతిని పొందిందని సైమన్ కొపెక్ వెల్లడించారు. ఈ పర్యటనతో గతంలో తమకు భారత్‌ అంటే ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని సైమన్ కొపెక్ వివరించారు. ఈ క్రమంలోనే భారత్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.


పోలాండ్‌కు చెందిన సైమన్ కొపెక్ తన భారత పర్యటన వివరాలను వెల్లడించారు. అయితే పోలాండ్‌లో భారత్ అంటే మురికివాడలు, కిక్కిరిసిపోయే రైళ్లు, రైళ్ల పై భాగంలో కూర్చొని ప్రయాణించడం అని భావిస్తారని.. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం అలా లేదని తెలిపారు. వందే భారత్ రైలులో ప్రయాణించడం.. భారత్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితులను తెలియజేస్తున్నాయని.. మూస పద్దతుల నుంచి బయటికి వచ్చినట్లు వివరించారు. సరైన సమయానికి అత్యంత వేగంతో వందే భారత్ రైలులో గమ్యస్థానానికి చేరినట్లు పేర్కొన్నారు.


తన తల్లి యూరప్ దాటి బయటికి రావడం ఇదే తొలిసారి అని.. ఆమెకు ఇంగ్లీష్ కూడా రాదని తెలిపారు. అయితే తన తల్లి భారత్ గురించి చాలా విన్నదని.. అయితే అదంతా తప్పు అని ఇక్కడికి వచ్చాక అర్థం అయిందని దాంతో ఆమె ఇక్కడి అందాలను చూసి ఆశ్చర్యపోయిందని తెలిపారు. టాక్సీ రైడ్లు, షాపింగ్‌లు ఆమెను చాలా ఆకర్షించాయని వివరించారు. రోడ్ల వెంట వెళ్తుంటే చెట్లు, పంట పొలాలకు సంబంధించి తన తల్లి ఎన్నో ఫోటోలు తీసుకుందని తెలిపారు. ఇక్కడ ఉన్న చెట్లు, వృక్షసంపదను చూసి ఆమె ఆశ్చర్యంలో మునిగిపోయిందని వెల్లడించారు. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న పచ్చని.. అందంగా ఉండే చెట్లను చూసి తన తల్లి ఎంతో సంతోషం వ్యక్తం చేసిందని తెలిపారు.


ఇక భారత్‌లో టెక్నాలజీని చూసి ఆమె షాక్ అయ్యారని సైమన్ కొపెక్ వెల్లడించారు. ఈ విషయంలో పోలాండ్‌ చాలా వెనుకబడి ఉందని తెలిపారు. ఒక యాప్‌ గురించి సెర్చ్ చేస్తే దానికి పోటీగా మరో 6 ప్రత్యామ్నాయ యాప్‌లు ఉన్నాయని తాను ఆమెకు చూపించినట్లు చెప్పారు. భారతదేశ చరిత్ర గురించి పుస్తకాలల్లో సగం కూడా లేదని సైమన్ కొపెక్ తెలిపారు. ఢిల్లీలోని తాజ్ మహల్, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని కోటలను చూసినపుడు.. బ్రిటీష్ వలస పాలనకు ముందు శతాబ్దాల క్రితం భారత దేశం ఎలా ఉందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని కొనియాడారు.


అన్నింటికన్నా ఎక్కువగా భారత్‌లో తన తల్లి ఎక్కువగా ఇక్కడి ప్రజలను ఇష్టపడిందని తెలిపారు. వారితో మాట్లాడకపోయినప్పటికీ.. అక్కడ ఉన్న పరిసరాలు, ఆనందాలను చూసి ఎంతో సంతోషం పొందిందని చెప్పారు. ప్రస్తుతం తాము భారత పర్యటన ముగించుకుని పోలాండ్ వెళ్లిపోయినట్లు వివరించారు. అయితే తన తల్లి ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నా.. వారి కుటుంబ సభ్యులకు హాలిడే ట్రిప్ కోసం భారత్‌ వెళ్లాలని సూచిస్తోందని సైమన్ కొపెక్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com