చాలా మంది గుడికి భక్తితో వస్తారు. మరికొందరు భయంతో కూడా వస్తారు. ఇంకా కొందరు అయితే దొంగతనం కోసం కూడా వస్తూ ఉంటారు. అలాగే వచ్చిన ఓ దొంగ గర్భగుడిలో అడ్డంగా దొరికిపోయాడు. అయితే అక్కడ ఉన్న డబ్బులో, నగలో, ఇతర వస్తువులో కాదు ఏకంగా గుడిలో ఉన్న విగ్రహాన్ని ఎత్తుకెళ్లాడు. ఎవరూ లేని సమయంలో ఆలయంలోకి చొరబడిన ఆ దొంగ.. అక్కడ ఉన్న విగ్రహాన్ని తీసుకుని ఉడాయించాడు. అది కాస్త ఆ గర్భగుడిలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో ఆ దొంగ చేసిన దొంగతనం బయటపడింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే?
కొన్ని కొన్ని దొంగతనాలు చూస్తే నవ్వు ఆగదు. ఇక సీసీటీవీ కెమెరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత దొంగలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన దొంగతనం కూడా అలాగే అనిపిస్తోంది. మీరట్ జిల్లాలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో ఉన్న ఓ శివాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ నెల 12 వ తేదీన ఓ వ్యక్తి.. శివాలయంలోకి వెళ్లాడు. ఆ సమయంలో ఆలయంలో ఎవరూ లేరని గ్రహించాడు. వెంటనే అటూ ఇటూ దిక్కులు చూశాడు. ఆ తర్వాత ఎంతో భక్తి ఉన్న భక్తుడిలాగా అక్కడ ఉన్న శివలింగంతోపాటు ఇతర దేవుళ్లకు, దేవతలకు దండం పెట్టుకున్నాడు.
మళ్లీ ఒకసారి బయటికి వెళ్లి ఎవరైనా వస్తున్నారా అని చూశాడు. ఆ తర్వాత శివుడి విగ్రహంపై ఉన్న నాగదేవతకు నమస్కరించి.. పూలు, ఇతర వస్తువులను పక్కకు జరిపి.. ఆ విగ్రహాన్ని తాను తెచ్చుకున్న సంచిలో వేసుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే గుడిలో ఉండే పూజారి తర్వాత వచ్చి చూసేసరికి శివలింగంపై ఉండాల్సిన నాగదేవత విగ్రహం కనిపించలేదు. దీంతో ఆ గుడిలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. అసలు విషయం బయటికి వచ్చింది. ఓ వ్యక్తి దర్జాగా పట్టపగలే గుడిలోకి చొరబడి ఆ నాగదేవత విగ్రహాన్ని ఎత్తుకెళ్లడం స్పష్టంగా సీసీటీవీల్లో రికార్డ్ అయింది.
ఈ విషయాన్ని ఆ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. గర్భగుడిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. నిందితుడి ఆనవాళ్లను గుర్తించారు. అనంతరం ఆ దొంగను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. త్వరలోనే ఆ దొంగను పట్టుకుని.. నాగ దేవత విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి గుడికి అప్పగిస్తామని తెలిపారు. అయితే రాగితో చేసిన శివలింగంపై ఉన్న నాగదేవత విగ్రహాన్ని ఆ దొంగ ఎత్తుకెళ్లినట్లు పూజారి తెలిపాడు.