కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను క్రమంగా ప్రకటిస్తోంది. ఇప్పటికే 195 మందితో మొదటి జాబితా విడుదల చేసిన కమలం పార్టీ.. తాజాగా మరో 72 మందితో రెండో జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో ఇప్పటికే తొలి విడతలో తెలంగాణలో 9 మంది పేర్లను బీజేపీ ప్రకటించగా.. తాజాగా ఆరుగురితో కూడిన జాబితాను రిలీజ్ చేసింది. తొలి జాబితాలో చోటు దక్కని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి రెండో జాబితాలో సీటును ఖరారు చేశారు. మొత్తం 11 రాష్ట్రాల నుంచి కొన్ని స్థానాలకు రెండో జాబితాలో అవకాశం కల్పించారు. ఇక తెలంగాణలో వరంగల్, ఖమ్మం మినహా మిగిలిన 15 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది.
తాజాగా హర్యానా సీఎం పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్‌కు లోక్‌సభ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ అవకాశం కల్పించింది. కర్నాల్ నియోజకవర్గం నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ లోక్‌సభ బరిలో నిలిచారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ముంబై నార్త్ నుంచి మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పోటీ చేయనున్నారు. మరోవైపు.. ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌కు హర్‌ద్వార్ టికెట్ కేటాయించారు. ఇక హిమాచల్ ప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పోటీలో ఉన్నారు. హమీపూర్ స్థానం నుంచి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్నారు. మరోవైపు.. కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై.. హవేరీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి.. ధార్వాడ్ నుంచి బరిలోకి దిగనున్నారు. శివమొగ్గ నుంచి కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్రకు అవకాశం కల్పించారు. బళ్లారి నుంచి శ్రీరాములుకు టికెట్ ఇచ్చారు.
మొత్తం 72 మందితో బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితాలో తెలంగాణ నుంచి ఆరుగురు ఉన్నారు. అందులో ఇటీవలె బీజేపీలో చేరిన వారికి కూడా టికెట్ ఇచ్చారు. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గోడం నగేష్‌కు కమలం పార్టీ అవకాశం కల్పించింది. మెదక్ నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు అవకాశం దక్కింది. ఇక ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి పరాజయం పాలైన రఘునందన్ రావుకు లోక్‌సభకు పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇక మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి డీకే అరుణ పేరును ఖరారు చేశారు. మరోవైపు.. మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి సీతారాం నాయక్ పోటీ చేయనున్నారు. నల్గొండ స్థానం నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు. పెద్దపల్లి సీటును గోమాస శ్రీనివాస్‌కు అవకాశం ఇచ్చారు. అయితే తొలి విడతలో 9 మందికి, రెండో విడతలో ఆరుగురికి అవకాశం కల్పించగా.. తెలంగాణలో ఉన్న మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో ఖమ్మం, వరంగల్ నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేయలేదు.
తొలి జాబితాలో మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి డాక్టర్ మాధవీలత, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూల్ నుంచి భరత్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్‌లకు అవకాశం కల్పించారు. దాద్రానగర్ హవేలీ, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి మొత్తం 72 మందికి బీజేపీ రెండో జాబితాలో అవకాశం కల్పించింది.