మహిళల కోసం సరికొత్త పథకం 'కలలకు రెక్కలు' పేరుతో కొత్త కార్యక్రమానికి తెలుగు దేశం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. విద్యార్థినులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకునే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళల కోసం టీడీపీ మొదటి నుంచి అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిందన్నారు. టీడీపీ సూపర్ సిక్స్‌లో మహాశక్తి కార్యక్రమంతో మహిళా సంక్షేమం చేపట్టబోతున్నట్టు ఆయన చెప్పారు. గతంలో దీపం పథకం ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. సూపర్ సిక్స్‌లో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పారు. చదువుకోవాలని అనుకున్న ఆడపిల్లలకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక.. ఇంటికే పరిమితం కాకూడన్న ఆశయంతో 'కలలకు రెక్కలు' అనే పథకానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న ఆడబిడ్డలు పై చదువులు చదువుకునేందుకు బ్యాంక్ లోన్‌ల ద్వారా అవకాశం కల్పిస్తామన్నారు. వారు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుందని, అంతేకాకుండా కోర్సు కాలానికి ఋణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. మహిళలను మహాశక్తులుగా మార్చేందుకు టీడీపీ హామీ ఇచ్చిందే మహాశక్తి పథకమని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా ఇప్పటికే పేరు నమోదు చేసుకోవడం కోసం kalalakurekkalu.com వెబ్‌సైట్‌ను టీడీపీ రూపొందించింది.