ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంజాన్ సమయంలో ముస్లింలు ఉపవాసం ఎందుకు ఉంటారో తెలుసా..?

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2024, 12:56 PM

ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం స్టార్ట్ అయ్యింది. ఈ మాసంలో ముస్లింలందరూ ఉపవాసం ఉంటారు. రంజాన్ మాసాన్ని ముస్లింలు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసం అంతటా ముస్లింలు ఉపవాసం ఉంటారు. రోజుకు ఐదు సార్లు ప్రార్థనలు చేస్తారు.
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం తొమ్మిదో నెల రంజాన్ మాసంగా పేర్కొంటారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఆధ్యాత్మికత ప్రార్థనలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. అల్లాని ప్రార్థిస్తూ ఉపవాసం ఉంటారు. నెల రోజుల పాటు ఈ మాసంలో ఉపవాసం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఆహారం, పానీయాలు, శారీరక అవసరాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. తప్పనిసరిగా ఖురాన్ పఠిస్తారు.
రంజాన్ ఉపవాసం ప్రాముఖ్యత
ఉపవాసం అనేది ఇస్లాం ఐదు సూత్రాలలో ఒకటి. స్వీయ క్రమశిక్షణ, దాతృత్వం, ఆధ్యాత్మికం వంటి వాటిని ప్రతిబింబిస్తుంది. కుటుంబం స్నేహితులతో కలిసి భోజనం చేస్తారు. ఏవైనా పొరపాట్లు, తప్పులు చేస్తే క్షమాపణల కోరుకుంటూ అల్లాను ప్రార్థిస్తారు. సూర్యోదయంలోపు ఉపవాసం ప్రారంభం కాకముందు చేసే భోజనాన్ని సెహరీ అంటారు. సాయంత్రం ఉపవాసం విరమించడం తర్వాత చేసేదాన్ని ఇఫ్తార్ అంటారు. ఉపవాసం సమయం సుమారు 12 గంటలకు పైగా ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలను అనుసరించి సెహ్రీ, ఇఫ్తార్ విందులు ఉంటాయి. రంజాన్ మాసంలో ఉపవాసం పాటించడం వల్ల అల్లాహ్ సంతోషిస్తాడని, చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు.
రంజాన్ మాసంలో చేసే ప్రార్థనలు అసమానమైన పుణ్యాన్ని కలిగిస్తాయని విశ్వసిస్తారు. ప్రతిరోజు చేసే నమాజ్ కాకుండా ఈ మాసంలో చేసే నమాజ్‌కు వంద రెట్లు పుణ్యం లభిస్తుంది. అల్లాహ్ పట్ల విధేయత, భక్తిని చూపిస్తూ ఉపవాసం ఉంటారు. తన దృష్టి మొత్తం ప్రార్థన మీద నిలుపుతారు. దైవిక ఆశీర్వాదాలు కోరుకుంటూ ఆధ్యాత్మికంగా బలపడేందుకు ఈ మాసం ఉపయోగపడుతుంది. దయతో చేసే పనులు అల్లాని సంతోషపరుస్తాయని నమ్ముతారు. రంజాన్ మాసంలో ప్రతిరోజు ఐదు సార్లు మసీదుకు వెళ్లి నమాజ్ చేస్తారు. అలా చేయడం కుదరని వాళ్ళు శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ నమాజ్ చేస్తారు.
మనసు శుద్ది చేసేందుకు
రంజాన్ మాసంలో శారీరక పోషణకు దూరంగా ఉంటారు. హృదయంలోని పాప ఆలోచనలు నుంచి విడుదల కల్పించామని కోరుకుంటూ, మనసుని శుద్ది చేయమని అల్లాను ప్రార్థిస్తారు. చెడు తలంపులు రాకుండా మనసు మొత్తం దైవాన్ని ప్రార్థిస్తూ రోజు గడుపుతారు. వినయం, భక్తి, స్వీయ క్రమశిక్షణ వంటి సద్గుణాలు ఇవ్వమని అల్లాని వేడుకుంటారు.
రంజాన్ మాసంలో మత పెద్దలతో కలిసి నమాజ్ చేస్తారు. నెల రోజులపాటు కఠినమైన నియమాలు అనుసరిస్తూ ఉపవాసం ఉంటారు. ఉపవాసం సమయంలో కనీసం నీరు తాగరు. ఉమ్మి కూడా మింగరు. ఈ సమయంలో దానాలకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. పేదవారి కోసం ఎంతో కొంత దానం చేస్తూనే ఉంటారు. ఈ దానాల వల్ల పేదలు కూడా సంతోషంగా ఉండాలని ఖురాన్ సిద్దాంతం.
ఈ పవిత్రమైన సమయంలో ఎదుటివారిని దూషించకూడదు. దుర్భాషలాడకూడదు. తప్పుడు ఆలోచనలు చేయకూడదు. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో పేదలు, ఆకలి దప్పులతో ఉన్న వారిని ఆదుకోవాలి. పవిత్రమైన ఈ మాసంలో ఎవరైనా చనిపోతే అల్లాను చేరుకుంటారని విశ్వసిస్తారు. చంద్ర దర్శనంతో ఉపవాస దీక్షలు విరమించి ఈద్ ఉల్ ఫితర్ వేడుక జరుపుకుంటారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. దీన్ని ‘అలయ్ బలయ్’ అంటారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com