అయోధ్య బాల రాముని ఆలయానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్టు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.అయితే ఇదే అదనుగా కొంత మంది మోసగాళ్లు మాయమాటలు చెప్పి యాత్రికులను మోసం చేస్తున్నారు. ఇది గుర్తించిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ భక్తులకు తాజాగా పలు సూచనలు చేసింది.రామ్‌లల్లాను ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు భక్తులు దర్శించుకోవచ్చని ట్రస్ట్ వెల్లడించింది.ఆలయానికి వచ్చిన భక్తులు 60 నుంచి 75 నిమిషాల్లోనే బాలరాముడి దర్శనం చేసుకోవచ్చని తెలిపింది. భక్తుల ఫోన్లు, చెప్పులు, పర్స్‌లు ఆలయానికి బయటే వదిలి రావాలని సూచించింది. ఆలయంలోకి దండలు, పూలు, ప్రసాదాలను తీసుకరావద్దని భక్తులను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోరింది. మరోవైపు ఉదయం 4 గంటలకు ఇచ్చే మంగళహారతి, 6 గంటల 15 నిమిషాలకు ఇచ్చే అలంకరణ హారతి, రాత్రి 10 గంటలకు ఇచ్చే శయన్ హారతికి మాత్రమే ఎంట్రీ పాస్‌లు అవసరమని ఆలయ ట్రస్ట్ తెలిపింది. ఈ పాసులను ఆన్‌లైన్‌లో ఉచితంగా పొందవచ్చని ట్రస్ట్ వెల్లడించింది.ప్రత్యేక దర్శనాలని చెప్పి….డబ్బులు వసూలు చేసే వారిని నమ్మి మోసపోవద్దని ట్రస్ట్ భక్తులకు జాగ్రత్త చెప్పింది.