ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. వాలంటీర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ఒకట్రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వాలంటీర్లను అన్నిరకాల ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలని సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రక్రియలో పాల్గొన్నా ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పోలింగ్ ఏజెంట్లుగా ఉండేందుకు కూడా వాలంటీర్లకు అర్హులు కాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని హైకోర్టు కూడా ఇటీవల తీర్పునిచ్చింది. అలాగే ఎన్నికల సంఘం కూడా ఈ విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులు అప్పగించవద్దని ఎన్నికల సంఘం ఇటీవలే ఏపీ ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్రపైనా కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవడానికి అభ్యంతరం చెప్పని ఎన్నికల సంఘం.. అయితే వారి పాత్రపైన మాత్రం కీలక ఆదేశాలు ఇచ్చింది.ప్రతీ పోలింగ్ బూత్‌లో రెగ్యులర్ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోవచ్చని చెబుతూనే.. ఓటర్ల వేలుకు ఇంకుపూసే విధులు వంటివి మాత్రమే అప్పగించాలని ఏపీ సీఈవోకు రాసిన లేఖలో స్పష్టం చేసింది. అంతకంటే ముఖ్యమైన పనులేవీ వారికి అప్పగించవద్దని స్పష్టం చేసింది. ఇక బీఎల్‌వోలుగా పనిచేసిన సిబ్బందిని కూడా పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని సూచించింది . వారికి ఇతర పనులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఇటీవల ఏపీ సీఈవోకు రాసిన లేఖలో పేర్కొంది.
మరోవైపు.. వాలంటీర్లకు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం అందుతుంది . దీంతో అధికార పార్టీకి వారు అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని గతంలో ఈసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో రాష్ట్రంలో పలు ఎన్నికల్లోనూ వారికి విధులు కేటాయించలేదు. అలాగే వచ్చే ఎన్నికల్లోనూ వాలంటీర్లకు విధులు అప్పగించవద్దని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.