అభ్యర్థుల ఎంపికలో ప్రజల్లో పట్టున్నవారికే తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తోంది. 94 మందితో ఇదివరకే విడుదల చేసిన మొదటి జాబితాలోనేగాక 34 మంది అభ్యర్థులతో గురువారం ప్రకటించిన రెండో జాబితాలో కూడా ఇదే కోణం ప్రధానంగా ప్రతిఫలించింది. ఈ 34 మంది అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా విడుదల చేశారు. కొన్నిచోట్ల మార్పుపై తర్జనభర్జనలు జరిగినా ప్రజల్లో సానుకూలత ఉందనుకున్న చోట సీనియర్లకే అవకాశం ఇచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరు దీనికి ఉదాహరణ. వయోవృద్ధుడైన మాజీ ఎమ్మెల్యే ఎన్.వరదరాజులురెడ్డి(81)కి టికెట్‌లభించింది. ఆయన వయసు రీత్యా బాగా సీనియర్. ఆయన కంటే ఆర్థికంగా బాగా స్థితిమంతులు, యువ నేతలు పోటీపడ్డారు. కానీ పార్టీ సర్వేల్లో ప్రజాదరణలో వరదరాజులురెడ్డికే ఎక్కువ మొగ్గు ఉన్నట్లు తేలింది. దీంతో ఆయనకే అవకాశమిచ్చారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో మాజీ ఎమ్మెల్యే కేఎ్‌సఎన్‌ఎస్ రాజు గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనకు నియోజకవర్గ బాధ్యతలు వద్దంటూ వైదొలిగారు. అక్కడ బత్తుల తాతయ్యబాబును ఇన్‌చార్జిగా నియమించారు. రెండేళ్ల తర్వాత మళ్లీ రాజు పార్టీ పనికి ముందుకొచ్చారు. తాతయ్యబాబుతో వైరం పెట్టుకోకుండా కలిసి పనిచేశారు. ఇప్పుడు సర్వేలు చేస్తే ప్రజలు ఆయనవైపే మొగ్గు చూపారు. ఆర్థిక స్తోమత లేకపోయినా ప్రజాదరణ వల్ల ఆయనకు అవకాశం దక్కింది. మొదటి జాబితాలో నంద్యాల అసెంబ్లీ సీటును ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన టీడీపీ.. రెండో జాబితాలో గుంటూరు తూర్పు, మదనపల్లె సీట్లను ఆ వర్గానికే చెందిన మహమ్మద్ నజీర్, షాజహాన్ బాషాలకు కట్టబెట్టింది. ఒక టీవీ చానల్లో పాత్రికేయుడిగా పనిచేసిన డాక్టర్ మురళీమోహన్‌కు పూతలపట్టు (ఎస్సీ) స్థానం కేటాయించారు. రంపచోడవరం (ఎస్టీ)లో అంగన్వాడీ మాజీ కార్యకర్త శిరీషకు అవకాశం దక్కింది. గుంటూరు జిల్లా పెదకూరపాడు స్థానం రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త భాష్యం ప్రవీణ్‌కు దక్కింది.