టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన మరదలు పెట్టిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని హైకోర్టులో వేసిన పిటిషన్‌పై జస్టిస్ టి.మల్లికార్జునరావు విచారణ చేపట్టారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవేనన్నారు పిటిషనర్ తరఫున సీనియర్ లాయర్ పోసాని వెంకటేశ్వర్లు. నారాయణ ప్రస్తుత ఎన్నికలల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని చెప్పారు. ఆయనను ప్రచారం చేయనీయకుండా ఏపీ పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టుకు తెలిపారు. నెల్లూరులోనే ఉన్నప్పటికీ పిటీషనర్ అందుబాటులో లేరని పోలీసులు అసత్యాలు చెబుతున్నారని న్యాయవాది అన్నారు.
ఈ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నిబంధనలను అనుసరించి నోటీసు ఇచ్చి వివరణ తీసుకుంటామని పోలీసుల తరఫున ఏపీపీ తెలిపారు. నారాయణకు 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ వివరాలను నమోదు చేసిన న్యాయమూర్తి.. బెయిలు పిటిషన్‌పై విచారణను మూసివేశారు. తనను వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలతో నారాయణ మరదలు పొంగూరు కృష్ణప్రియ ఫిర్యాదు ఆధారంగా నెల్లూరు, బాలాజీనగర్ పోలీసులు ఈ ఏడాది మార్చి 4న నారాయణతోపాటు పలువురిపై ఐపీసీ 498ఏ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నారాయణ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు.
మరోవైపు ఇదే వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని నారాయణ అల్లుడు పునీత్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని స్పష్టంచేశారు. 41ఏ నిబంధనలను పాటించాలని హైకోర్టు ఆదేశించింది.