బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారం నాడు 21 మంది మంత్రులతో తన మంత్రివర్గాన్ని విస్తరించారు. దీంతో బీహార్‌లో సీఎంతో కలిపి మొత్తం మంత్రుల సంఖ్య 30కి చేరింది. పాట్నాలో నూతనంగా చేరిన మంత్రుల ప్రమాణస్వీకారోత్సవంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. శుక్రవారం చేరిన మొత్తం 21 మంది మంత్రుల్లో 12 మంది బీజేపీకి చెందిన వారు కాగా మిగిలిన తొమ్మిది మంది జేడీ (యు)కి చెందిన వారు. బీజేపీ నుంచి కొత్తగా చేరిన మంత్రులు రేణుదేవి, మంగళ్ పాండే, నీరజ్ కుమార్ బబ్లూ, నితీష్ మిశ్రా, నితిన్ నబిన్, జనక్ రామ్, కేదార్ గుప్తా, దిలీప్ జైస్వాల్, కృష్ణానందన్ పాశ్వాన్, సంతోష్ కుమార్ సింగ్, సురేంద్ర మెహతా, హరి సాహ్ని. జేడీయూ నుండి మంత్రులు అశోక్ చౌదరి, లేషి సింగ్, మదన్ సాహ్ని, మహేశ్వర్ హజారీ, షీలా కుమారి మండల్, సునీల్ కుమార్, జయంత్ రాజ్, జమా ఖాన్ మరియు రత్నేష్ సదా ఉన్నారు.వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ, జేడీ(యూ) మధ్య సీట్ల పంపకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బీహార్ మంత్రివర్గ విస్తరణ జరిగింది. బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా జనవరి 28న ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం.