టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చెబితే అది చేస్తానని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావ్ అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అప్పజెప్పిన బాధ్యతలను నెరవేరుస్తానని అన్నారు. పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా దాన్ని అంగీకరించాలని చంద్రబాబు చెప్పారని అన్నారు. ఆయన నాకు ఎలాంటి నష్టం చేయరని భావిస్తున్నానని తెలిపారు. తాను పోటీ చేసేది చీపురుపల్లా, ఎంపీనా లేక ఎచ్చెర్ల అనేది కాదని చంద్రబాబు ఏం చెబితే అది చేస్తానని తెలిపారు. రాజకీయాల్లో ఎప్పుడూ కొన్ని శక్తులు ఉంటాయని దాని గురించి తానేం మాట్లాడనని అన్నారు. ఓసారి ముందు ప్రకటించొచ్చని.. ఓసారి చివర్లో ప్రకటన రావచ్చని తెలిపారు. తనకు ఇంకా టిక్కెట్ రాలేదనే దానిపై కొందరు అపొహలు సృష్టిస్తున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తానని అన్నారు. తనకు హోం మంత్రి పదవిచ్చినా.. ఇతర మంత్రి పదవిచ్చినా తనకు ముందుగా ఏం చెప్పలేదన్నారు. రాజ్యసభ కూడా అదే విధంగా తనకు ఇచ్చారని తెలిపారు. ఎవరెన్ని అపొహలు సృష్టించినా.. కార్యకర్తలు ఆందోళనకు గురికావొద్దని చెప్పారు. పార్టీ ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా పాటించానని అన్నారు. ఆరేళ్లు పార్టీ ఏపీ అధ్యక్షుడిగా పని చేశానని కళా వెంకట్రావ్ గుర్తుచేశారు.