చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగళం సభలో కార్యకర్తల అత్యుత్సాహం ఇబ్బందిపెట్టింది. పొత్తు కుదిరిన తర్వాత మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేస్తున్న తొలి సభ కావటం.. అందులోనూ పదేళ్ల తర్వాత ప్రధాని మోదీ. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొంటున్న సభ కావటంతో మూడు పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అశేషంగా తరలివచ్చిన కార్యకర్తలతో బొప్పూడిలో సందడి వాతావరణం నెలకొంది. అయితే సభ జరుగుతున్న సమయంలో కార్యకర్తల అత్యుత్సాహం నేతలను ఇబ్బంది పెట్టింది.
ప్రధాని నరేంద్ర మోదీ సభావేదిక వద్దకు చేరుకునే సరికి సభాప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. కొంతమంది కార్యకర్తలు, మీడియా సిబ్బంది పోల్ ఎక్కి మరీ ప్రసంగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని మొదలెట్టగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యలో జోక్యం చేసుకున్నారు. టవర్ ఎక్కిన కార్యకర్తలను కిందకు దిగాలంటూ విజ్ఞప్తి చేశారు. పవన్ ప్రసంగాన్ని ఆపి మరీ మైక్ అందుకున్న ప్రధాని.. జీవితం చాలా విలువైందని.. ఇలాంటి పనులు చేయవద్దంటూ వారికి సూచించారు. ఇక ప్రధాని పిలుపుతో అక్కడున్న వారంతా కిందకు దిగేశారు.
అయితే కాసేపటికే మరో సమస్య మొదలైంది. కార్యకర్తల అత్యుత్సాహం మరో ఇబ్బంది తెచ్చిపెట్టింది. సభా వేదిక ముందు ఏర్పాటు చేసిన సౌండ్ బాక్సుల మీద పెద్ద ఎత్తున కార్యకర్తలు పడటంతో మైక్ కట్ అయ్యింది. దీంతో పదేపదే పవన్ కళ్యాణ్ ప్రసంగానికి అంతరాయం కలిగింది. వేదిక మీద ఉన్న నేతలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్పప్పటికీ కార్యకర్తలు అలాగే వ్యవహరించడంతో ప్రసంగాలకు అంతరాయం కలిగింది. ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే.. మరోసారి మైక్‌కు అంతరాయం కలిగింది. ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో మైక్ పలుమార్లు అంతరాయం కలిగించింది. అయితే ప్రధాని మోదీ అలాగే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని ఆకాంక్షించారు.