పెట్రోల్, డీజిల్ ధరలు కొంతకాలంగా సామాన్యులకు గుదిబండగా మారిన సంగతి తెలిసిందే. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో అంతర్జాతీయంగా చమురు ధరలు ఎగబాకిన సమయంలో దేశీయంగా ఇంధన కంపెనీలు నష్టపోయాయి. అయితే అప్పుడు రేట్లు పెంచుకుంటూ పోగా.. 2022 లోనే రికార్డు గరిష్టాలకు చేరాయి. తర్వాత అంతర్జాతీయంగా రేట్లు దిగొచ్చినా.. దేశీయంగా చమురు కంపెనీలు మాత్రం రేట్లను సవరించలేదు. స్థిరంగా ఉండి దాదాపు రెండేళ్లు అయ్యాక గత వారమే భారత ఆయిల్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) రూ. 2 చొప్పున పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే.
ఈ రేట్లు రూ. 2 చొప్పున తగ్గించినప్పటికీ పెద్దగా ఉపశమనం లభించింది లేదు. ఎందుకుంటే ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో చాలా నగరాల్లో ధరలు రికార్డు గరిష్టాల వద్దే ఉన్నాయి. ఈ ధరలు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. అంతటా ఒకేలా ఉండవు. స్థానికంగా సేల్స్ టాక్స్ లేదా వాల్యూ యాడెడ్ టాక్స్ రేట్లలో వ్యత్యాసాన్ని బట్టి ఈ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.
>> అయితే ప్రస్తుతం దేశంలో మరి ఇంధన ధరలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో తెలుసా? ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా అత్యధికం అట. ఇక తెలంగాణ, కేరళ కూడా ముందువరుసలోనే ఉన్నాయి. ఇక్కడ వ్యాట్ రేట్లు, స్థానిక పన్ను రేట్ల కారణంగా ఎక్కువగా ఉండగా.. మరోవైపు అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఢిల్లీ, కొన్ని ఈశాన్య ప్రాంతాల్లో తక్కువ వ్యాట్ కారణంగా రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నాయి.
>> వైసీపీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 109.87 వద్ద ఉంది. ఇదే దేశంలో అత్యధికం కావడం గమనార్హం. తర్వాత LDF కూటమి అధికారంలో ఉన్నటువంటి కేరళలో లీటర్ పెట్రోల్ రూ. 107.54 పలుకుతుండగా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో ఇది రూ. 107.39 గా ఉంది.
>> పలు భాజపా పాలిత రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ రేట్లు గరిష్టాల్లోనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో (భోపాల్) పెట్రోల్ లీటర్‌కు రూ. 106.45కు అమ్ముడవుతోంది. భాజపా- జేడీయూ కూటమి నేతృత్వంలోని బిహార్‌లో (పట్నా) రూ. 105.16 వద్ద .. రాజస్థాన్‌లో రూ. 104.86, ముంబైలో రూ. 104.19 గా ఉంది.
>> టీఎంసీ అధికారంలోని బెంగాల్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 109.93 గా ఉంది. ఒడిశాలో రూ. 101.04, తమిళనాడులో రూ.100.73 కాగా.. ఛత్తీస్‌గఢ్‌లో రూ.100.37 గా ఉన్నట్లు తెలిసిందే. ఇక తక్కువగా అండమాన్ నికోబార్ ఐలాండ్‌లో పెట్రోల్ రేటు రూ. 82 గా ఉంది. ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలు సిల్వస్సా, దమణ్ దీవుల్లో రూ. 92, ఢిల్లీలో రూ. 94.76, గోవాలో రూ. 95, మిజోరంలో రూ. 93, గువాహటిలో (అసోం) రూ. 96 కు లీటర్ పెట్రోల్ లభిస్తుంది.
డీజిల్లోనూ ఆంధ్రానే టాప్..
పెట్రోల్ ధరలతో పాటే డీజిల్ రేట్లు కూడా సెంచరీ దిశగా పయనిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా లీటర్ డీజిల్ రేటు రూ. 97.6 గా ఉంది. కేరళలో (తిరువనంతపురం) రూ. 96.41 వద్ద, తెలంగాణలో (హైదరాబాద్) రూ. 95.63 గా ఉంది. మహారాష్ట్ర, బిహార్ వంటి భాజపా పాలిత రాష్ట్రాల్లో రూ. 92-93 గా ఉన్నాయి. డీజిల్ రేటు కూడా తక్కువగా అండమాన్ నికోబార్‌లోనే రూ. 78 వద్ద ఉండగా.. ఢిల్లీ, గోవాల్లో లీటర్‌కు రూ. 87 వద్ద ఉంది.