రాష్ట్రంలో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమిదే విజయమని జనసేనాని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. గంగమ్మ తల్లి హిమాలయాల నుంచి భూమ్మీదకు వచ్చి ఎలా సేదనిచ్చిందో.. మోదీ రాక, ఎన్డీయే పునఃకలయిక 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు ఆనందాన్నిచ్చిందన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడిగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రా ప్రజానీకం.. దాష్టీకం, దోపిడీతో నలుగుతున్న ఆంధ్ర ప్రజానీకం.. అవినీతి, అప్రజాస్వామిక విధానాలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర ప్రజానీకం.. మోదీ రాక కోసం ఎదురుచూస్తోందన్నారు. దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతూ.. హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి ఆంధ్ర ప్రజల తరఫున, ఎన్డీయేలో భాగస్వాములైన మూడు పార్టీల తరఫున ఘనస్వాగతం పలుకుతున్నానని చెప్పారు. ‘ఆంధ్ర రాజధాని అమరావతి దేదీప్యమానంగా వెలగాలని, దానికి నేను అండగా ఉన్నానని మోదీ వచ్చారు. మన కోసం, మన కష్టానికి భుజం కాయడానికి, 5 కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నానని వచ్చారు. జరుగబోయేది కురుక్షేత్రం. ఈ యుద్ధంలో ధర్మానిదే విజయం.. కూటమిదే పీఠం. నేను దేవదత్తం పూరించాను. అర్జునుడు పూరించిన శంఖం పేరు దేవదత్తం. గుజరాత్‌లోని ద్వారక నుంచి వచ్చిన మోదీ పాంచజన్యం పూరిస్తారు. 2014 బాలాజీ ఆశీస్సులతో సాధించిన విజయాన్ని మించిన ఘనవిజయాన్ని ఈసారి సాధిస్తున్నాం. బిడ్డలకు అండగా ఉండే దుర్గమ్మ తల్లి.. అయ్య కంటే ఒక ముద్ద ఎక్కువే పెడుతుంది. అలాంటి తల్లి ఆశీస్సులతో మన ప్రభుత్వం స్థాపించే దిశగా వెళ్తున్నాం’ అని చెప్పారు. సీఎం జగన్, వైసీపీ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.