ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని రెడీ అయ్యారు. ఇప్పటికే సిద్ధం సభలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల్లో ఓ ఉత్సాహం తీసుకువచ్చారు జగన్ . ఇక అభ్యర్థుల ఎంపిక సైతం పూర్తి కావటంతో.. పూర్తిగా ప్రచారం మీదే ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా మార్చి 27 వ తేదీ నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు సమాచారం. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తెలిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర ఇడుపులపాయలో ముగియనుంది. మొత్తం 21 రోజులపాటు జరిగే బస్సు యాత్రలో .. అన్ని నియోజవర్గాలను కవర్ చేసేలా వైసీపీ శ్రేణులు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిసింది.
బస్సుయాత్రలో ప్రతి నియోజకవర్గాన్ని చుట్టేసేలా జగన్ ప్లాన్ చేస్తున్నారట. అలాగే ప్రతిరోజూ ఒక బహిరంగసభలో జగన్ పాల్గొనేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తు్న్నారు. తొలి విడతలో బస్సు యాత్ర చేపట్టనున్న జగన్.. ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటారు. మరోవైపు ఎన్నికల ప్రచారం సమయంలోనూ జగన్ ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి అభ్యర్థులను ప్రకటించారు జగన్. నాటి ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లలో వైసీపీ విజయఢంకా మోగించింది. ఇక ఈసారి కూడా అప్పటిలాగే ఇడుపులపాయలోనే అభ్యర్థుల జాబితా విడుదల చేశారు.
ఇక బస్సు యాత్ర విషయానికి వస్తే వైఎస్ జగన్ విజయ శంఖారావం యాత్ర ప్రారంభమైన దగ్గర నుంచే.. ఇప్పటి బస్సు యాత్ర కూడా ప్రారంభం కానుంది. ఇచ్ఛాపురం నుంచే జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానున్నట్లు సమాచారం. మేమంతా సిద్ధం అంటూ జరిగే ఈ బస్సు యాత్ర ద్వారా ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని జగన్.. ప్రజలకు వివరించనున్నారు. అలాగే ఎన్డీయే కూటమిని టార్గెట్‌గా చేసుకుని ప్రచారం నిర్వహించనున్నారు.