టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కారణంగా టీడీపీ, జనసేనలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి. పొత్తు తమ సీటుకు ఎసరు తెస్తుండటంతో నియోజకవర్గాలలో అసంతృప్తులు భగ్గుమంటున్నారు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇది చాలా తలనొప్పి వ్యవహారంగా మారింది. మొన్ననే పిఠాపురం తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కగా.. అధినేత పిలిచి సముదాయించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ ఆఫర్ చేయటంతో.. ఆయన పవన్ పార్టీ తరుఫున ప్రచారం కూడా షురూ చేశారు. అయితే ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలనునున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తితో వైసీపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పెందుర్తి టికెట్ ఈసారి బండారు సత్యనారాయణమూర్తికి టీడీపీ అదిష్టానం కేటాయించలేదు. ఇప్పటి వరకూ విడుదల చేసిన రెండు జాబితాలలోనూ బండారుకు చోటుదక్కకపోగా.. పెందుర్తి సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న బండారు సత్యనారాయణమూర్తిను వైసీపీ నేతలు సంప్రదించినట్లు తెలిసింది. వైసీపీ ఇప్పటి వరకూ 175 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపింది. ఒక్క అనకాపల్లి ఎంపీ సీటుకు అభ్యర్థిని ప్రకటించలేదు.
ఈ నేపథ్యంలో అనకాపల్లి ఎంపీ సీటును వైసీపీ బండారుకు ఆఫర్ చేసినట్లు సమాచారం. బండారు సైతం వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి విశాఖ జిల్లాలో టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్న టీడీపీ, జనసేన నేతలను కూడగట్టే పనిలో బండారు ఉన్నారని తెలిసింది. ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాలలోని అసంతృప్తులను కలుపుకుని వైసీపీలోకి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. మరోవైపు అనకాపల్లి ఎంపీ సీటు గండి బాబ్జీకి ఇస్తారనే ప్రచారం కూడా నడుస్తోంది.
మరోవైపు గండి బాబ్జీ, బండారు సత్యనారాయణ మూర్తి పార్టీని వీడతారనే వార్తలు రావటంతో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. మరి పార్టీ అధినేత ఏమైనా హామీ ఇస్తారా.. లేదా వీరిద్దరూ ఫ్యాన్ పార్టీలోకి వెళ్తారా అనే దానిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.