తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుమలలో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో ఉత్సవర్లు విహరించే తెప్పను ఇంజనీరింగ్ అధికారులు సిద్ధం చేశారు. నీటిపై గాలితో కూడిన డ్రమ్ములను ఏర్పాటు చేసి, దానిపై మండపం రూపంలో ఉండే తెప్పను నిర్మించి.. రంగులు అద్దుతున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల కారణంగా పలు సేవల్ని రద్దు చేశారు. మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవను రద్దు చేశారు. అంతకాదు మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ సూచించింది.
తొలిరోజున సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా రామచంద్రమూర్తి తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండో రోజున రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు. మూడో రోజున శ్రీభూ సమేతంగా మలయప్పస్వామి మూడుసార్లు పుష్కరిణిలో విహరించి, భక్తులను అనుగ్రహిస్తారు. నాల్గవ రోజున ఐదుసార్లు, చివరిరోజు ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరిస్తారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలలో ప్రతి రోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
ఏప్రిల్ 5 నుంచి 13వ తేదీ వరకు శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 నుండి 13వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలో ఏప్రిల్ 3న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఏప్రిల్ 4న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 7 నుండి 8:30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8:30 గంటల వరకు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఏప్రిల్ 5న ఉదయం – ధ్వజారోహణం.. రాత్రి – పెద్దశేష వాహన సేవలు ఉంటాయి. ఏప్రిల్ 6న ఉదయం – చిన్నశేష వాహనం.. రాత్రి – హంస వాహనం ఉంటుంది.
ఏప్రిల్ 7నఉదయం – సింహ వాహనం.. రాత్రి – ముత్యపుపందిరి వాహన సేవలు ఉంటాయి. ఏప్రిల్ 8న ఉదయం – కల్పవృక్ష వాహనం.. రాత్రి – సర్వభూపాల వాహనంపై స్వామివారు విహరిస్తారు. ఏప్రిల్ 9న ఉదయం – పల్లకీ ఉత్సవం.. రాత్రి – గరుడ వాహన సేవలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 10న ఉదయం – హనుమంత వాహనం.. రాత్రి – గజ వాహనం సేవలు ఉంటాయి. ఏప్రిల్ 11న ఉదయం – సూర్యప్రభ వాహనం.. రాత్రి – చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతారు. ఏప్రిల్ 12న ఉదయం – రథోత్సవం.. రాత్రి – అశ్వవాహనంపై స్వామివార కటాక్షిస్తారు. ఏప్రిల్13న ఉదయం – చక్రస్నానం ధ్వజావరోహణం నిర్వహిస్తారు.
ఏప్రిల్ 5న తిరుమలలో 521వ అన్నమయ్య వర్థంతి
దకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యల 521వ వర్థంతి కార్యక్రమం ఏప్రిల్ 5న తిరుమలలో టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 5.30 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించనున్నారు. అటు తరువాత స్వామివారు ఉభయదేవేరులతో కూడి ఆలయానికి వేంచేపు చేస్తారు.