నంద్యాల జిల్లాలో తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్‌లో ఆశ్రయం పొందుతున్న పులి పిల్లలకు సంబంధించి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పులి పిల్లల్ని అతి త్వరలో నల్లమల అడవిలో వదిలిపెట్టనున్నారు. తల్లినుంచి తప్పిపోయి జనారణ్యంలో దొరికిన పులి కూనలకు నల్లమల అభయారణ్యంలోని ఇతర జంతువులను వేటాడటం నేర్పించేందుకు భారీ టైగర్ ఎన్‌క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
14 నెలల క్రితం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో నాలుగు పులి పిల్లలు తల్లి నుంచి విడిపోయాయి. ఈ పిల్లల్ని గమనించిన స్థానికులు రక్షించారు.. తల్లికి దగ్గర చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. దీంతో అటవీ శాఖ సిబ్బంది పులి పిల్లలను తిరుపతిలోని వెంకటేశ్వర జూ పార్కుకు తరలించి సంరక్షిస్తున్నారు. ఆరోగ్యం విషమించి ఓ పులిపిల్ల చనిపోగా.. మిగిలిన పులి పిల్లలకు రుద్రమ్మ, హరిణి, అనంతగా నామకరణం చేశారు. మూడు పిల్లలు పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని అటవీ వాతావరణంలో వదిలి పెట్టేందుకు అటవీ శాఖ నిర్ణయం తీసుకోవటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం తిరుపతి జూ పార్కులో ఉన్న పులి పిల్లలు వేటాడే సహజసిద్ధ గుణాన్ని మరిచిపోయి జూ అధికారులు అందజేసే ఆహారంతోనే జీవిస్తున్నాయి. వాటిని జూ పార్కు నుంచి తరలించి నేరుగా అభయారణ్యంలో వదిలి పెడితే అవి ప్రమాదాల బారినపడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకే వాటిని ఎన్‌క్లోజర్లలో ఉంచుతారు. స్వతహాగా కొన్ని వన్యప్రాణులను వేటాడి ఆహారాన్ని అవి సేకరించుకోగలిగేలా చూస్తారు. పులి పిల్లలు వేట నేర్చుకోవటం కోసం కాకినాడ నుంచి ప్రత్యేకంగా 37 చారల దుప్పులను నల్లమలకు తరలించి వాటిని ఎన్‌క్లోజర్లలో సంరక్షిస్తున్నారు. కొద్దిరోజుల అనంతరం వీటిని పులుల కోసం ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్లలో వదలటం ద్వారా పులులకు వేటాడటాన్ని అలవాటు చేస్తారు. అవి వ్యక్తిగతంగా 50 వన్యప్రాణులను వేటాడిన తరువాత వాటి శక్తి యుక్తులను గుర్తిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా పులి పిల్లల సంరక్షణ కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా కొర్రప్రోలు రేంజి పరిధిలోని పెద్దపెంటలో ఏర్పాటు చేశారు. తిరుపతి జూలో పెరుగుతున్న పెద్దపులులు సహజసిద్ధంగా వాటి ఆహారాన్ని అవి వేటాడగలిగేలా చేయటంతోపాటు అనాథలైన, తీవ్ర గాయాల పాలైన పెద్దపులులను ఇక్కడి నర్సరీ ఎన్‌క్లోజర్‌లలో పెట్టి సంరక్షిస్తారు. పులుల సంరక్షణకు అక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో 15 హెక్టార్లలో ప్రత్యేకమైన ఎన్‌క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ కేంద్రంలో పులులను సంరక్షించేందుకు వెటర్నరీ వైద్యులు ఎన్‌క్లోజర్ల దగ్గర అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
వేసవిని తట్టుకునేలా ఎన్‌క్లోజర్ చలువ పందిళ్లు వేసి నీటిని వెదజల్లేలా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. దుప్పుల ఆహారం కోసం వినుకొండ, మార్కాపురం ప్రాంతాల నుంచి సుబాబుల్, బుల్ ఫీడ్‌ను రప్పించి ఆహారంగా వేస్తున్నారు. చారల దుప్పులు సంతానోత్పత్తి చేసేలా పెద్దదోర్నాల రేంజి పరిధిలోని తుమ్మలబైలు వద్ద ఒక ఎన్‌క్లోజర్, నెక్కంటి రేంజి పరిధిలో మరో రెండు ఎన్‌క్లోజర్లను సిద్ధం చేస్తున్నారు. పులి పిల్లలకు వేటాడటంలో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa