ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 10:12 PM

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీని ప్రభావం ప్రధానంగా ఉత్తర కోస్తాపై ఉంటుందంటున్నారు. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వానలు పడే అవకాశం ఉందన్నారు. అక్కడక్కడా చెదురుమొదురు వర్షాలు కురుస్తూ.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి.


కోస్తా ప్రాంతంలో రెండు రోజులపాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. ఈ రెండు రోజుల తర్వాత మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. వర్షాలు పడే ప్రాంతాల్లో గాలుల వేగం కూడా ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలన్నారు. దయచేసి వ్యవసాయ మరియు ఉపాధి పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద ఉండొద్దన్నారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు.. విపత్తుల సంస్థ నుంచి అలర్ట్ మెసేజ్‌లు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోండి అశ్రద్ధ వహించవద్దన్నారు.


మరోవైపు తెలంగాణలో ఇప్పటికే పలు భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో మంగళవారం, బుధవారం ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కిందిస్థాయి గాలులు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని తెలిపింది. పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాలల్లో సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఆదే ప్రాంతంలో కొనసాగుతోందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఈ ప్రభావంతో ఇవాళ ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 30- 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa