టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. ఇప్పటికే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు.. మిగిలిన 16మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, 17 లోక్‌సభ అభ్యర్థుల్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈలోపు టీడీపీ అభ్యర్థులు, ముఖ్య నేతలతో ఒకసారి సమావేశంకావాలని నిర్ణయించారు. అందుకే ఈ నెల 23న వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమంలో చంద్రబాబు అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఈ వర్క్‌షాప్‌ను ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం జరుగుతుంది. అభ్యర్థులతో పాటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వారు ఇప్పటికే నియమించుకున్న అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, పొలిటికల్ మేనేజర్, మీడియా మేనేజర్, సోషల్ మీడియా మేనేజర్లను వర్క్‌షాప్‌నకు పిలిచారు. రాబోయే రెండు నెలల ఎన్నికల కార్యాచరణ, పోల్ మేనేజ్‌మెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ వర్క్‌షాప్‌లో వారికి అవగాహన కల్పిస్తారు.
అయిత పెండింగ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులను గురు, శుక్రవారాల్లో ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు ఈ నెల 24, 25 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. 26 నుంచి ప్రజాగళం పేరుతో చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభిస్తారు. రోజుకో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పర్యటన ఉంటుంది. ఉదయం ఒక శాసనసభ నియోజకవర్గంలో 10 వేల మందితో ప్రజాగళం సభ జరుగుతుంది. మధ్యాహ్నం 4.30 గంటలకు ఒక నియోజకవర్గంలో, రాత్రి 7.30కు మరో నియోజకవర్గంలో రోడ్డుషో నిర్వహిస్తారు. 26 నుంచి సుమారు 20 రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.