ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.15 వేల దహన సంస్కార ఖర్చు (మట్టి ఖర్చు)ను.. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రూ.25 వేలు చెల్లించేందుకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అంగీకరించారని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) తెలిపింది. ఉద్యోగులకు అండగా నిలబడినందుకు ఎండీకి కృతజ్ఞత తెలియజేస్తున్నట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జీవీ నరసయ్య తెలిపారు. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుండగా, ఆ రోజు దూరప్రాంత బస్సు సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లు తమ సొంతూరిలో ఓటు వేసే అవకాశం ఉండదని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ పేర్కొంది. అటువంటి వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తూ ఆదేశాలిచ్చేలా చూడాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాసినట్లు ఎన్‌ఎంయూఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.