తిరుమలలో శ్రీవారి దర్శన టిక్కెట్లకు సంబంధించిన కొత్త దందా వెలుగులోకి వచ్చింది. ప్రయివేట్ ట్యాక్సీలు, ఆటోవాలాలు టైమ్ స్లాట్ టోకెన్లు భక్తులకు అమ్ముకుంటున్న విషయం బయటపడింది. ఆటోలు, ట్యాక్సీలలో భక్తులను తీసుకెళ్లి శ్రీవారిమెట్టుకు తీసుకెళ్లి.. మొదట్లోనే టోకెన్లు తీసుకుని సొమ్ములు చేసుకుంటున్నారు. ఆ టోకెన్లతో బస్సులు, ట్యాక్సీలు, కార్లలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో నడక మార్గంలో వెళ్లే భక్తులు టైమ్ స్లాట్ టోకెన్లు దొరక్క
ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 1200వ మెట్టు దగ్గర సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేవారు. కానీ, ప్రస్తుతం మొదట్లోనే ఈ కౌంటర్ ఏర్పాటు చేశారు.
కాగా, ఇప్పటికే సర్వదర్శనం టోకెన్లను టీటీడీ భారీగా కుదించింది. ఒకప్పుడు 6 వేల వరకూ టోకెన్లు జారీచేయగా.. ప్రస్తుతం రెండు, మూడు వేలకు పరిమితం చేశారు. ఇదే సమయంలో దర్శనం టోకెన్ల విషయంలో ట్యాక్సీ, ఆటోవాలాలు దందాకు పాల్పడుతున్నారు. దీంతో దర్శన టిక్కెట్ల దొరక్క నడకదారిలో వెళ్లే భక్తులు అగచాట్లుపడుతున్నారు. ఈ దందాను అరికట్టాలని నడక మార్గం భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క కౌంటర్ మాత్రమే పెట్టారని, ఇది చాలా అన్యాయమని అంటున్నారు. కనీసం ఐదారు కౌంటర్లు పెట్టి ఎస్‌ఎస్డీ టోకెన్లు జారీచేయాలని, పిల్లలు ఊపిరాడక చాలా ఇబ్బందిపడుతున్నారని భక్తులు వాపోతున్నారు.
టిక్కెట్ పొందలేని భక్తులు తిరుమలలో ఉచిత దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు వెళ్లాలని మైక్‌లో అనౌన్స్ చేయడంతో చాలా మంది నిరాశతో వెనుదిరుగుతున్నారు. బస్సులు, వాహనాల్లో వెళ్లేవారికి టిక్కెట్లు ఇచ్చి, నడిచివేళ్లేవారికి టోకెన్ల ఇవ్వకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడిచివేళ్లే భక్తులకు స్టాంపింగ్ వేయాలని, అప్పుడే వారికి న్యాయం జరుగుతుందని అంటున్నారు.