ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్సీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్.. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు. వరప్రసాద్‌కు తిరుపతి ఎంపీ సీటు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో వరప్రసాద్ వైఎస్ఆర్సీపీ నుంచి తిరుపతి ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో ఆయనకు గూడూరు నుంచి ఎమ్మెల్యేగా పోటిచేసి విజయం సాధించారు. కానీ, ఈసారి మాత్రం సీఎం జగన్ మొండిచేయి చూపారు. గూడూరు టిక్కెట్‌ను ఎమ్మెల్సీ మురళీధరరావుకు కేటాయించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వరప్రసాద్.. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీలో చేరాు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేత రోషన్ కూడా బీజేపీ కండువ కప్పుకున్నారు. ఆయనకు బద్వేల్ ఎమ్మెల్యే సీటు ఖరారు చేసినట్టు సమాచారం. టీడీపీ-జనసేన కూటమిలో చేరిన బీజేపీకి 10 ఎమ్మెల్యే, ఆరు ఎంపీ సీట్లు దక్కాయి.
ఈ నేపథ్యంలో శనివారం జరిగిన సీఈసీ సమావేశంలో ఆరు ఎంపీ స్థానాలు , 10 ఎమ్మెల్యే స్థానాలకు బీజేపీ అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేసింది. సాయంత్రం ఏపీ ఎంపీ ,ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. ఇప్పటి వరకూ ఎన్డీయే కూటమి మొత్తం 155 ఎమ్మెల్యే స్థానాలు, 13 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా, 20 అసెంబ్లీ, 10 ఎంపీ సీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో తెలుగుదేశం పార్టీ 7, బీజేపీ 10, జనసేన మూడు చోట్ల అభ్యర్తులను ప్రకటించాల్సి ఉంది.
ఎమ్మెల్యే స్థానా రాజంపేట, గుంతకల్లు, ఆలూరు, అనంతపురం అర్బన్, దర్శి, చీపురపల్లి, భీమిలి స్థానాలకు టీడీపీ.. విజయవాడ వెస్ట్, ఎచ్చెర్ల, అనపర్తి, బద్వేల్, ఆదోని, పాడేరు, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్ నార్త్ సీట్లకు బీజేపీ.. పాలకొండ, రైల్వే కోడూరు, గుంతకల్లులో జనసేన అభ్యర్థులను ప్రకటించనున్నాయి. ఇక, ఎంపీ స్థానాలకు వస్తే అనకాపల్లి, అనంతపురం, రాజంపేట, కడప, ఒంగోలు, రాజమండ్రి, అరకు, నరసాపురం, తిరుపతి, విజయనగరం పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఆరు స్థానాలకు బీజేపీ, నాలుగు చోట్ల టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.