ట్రాన్స్‌జెండర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సమాజంలో వివక్షకు గురౌతున్న వారికి ఉపాధి కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వీరికి కూడా వర్తింపజేస్తూ మార్చి 15వ తేదీన ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఉపాధిహామీ పథకాన్ని ట్రాన్స్ జెండర్లకు కూడా అమలు చేయనున్నారు. దీంతో ట్రాన్స్ జెండర్లకు జాబ్ కార్డులు అందించే పనిలో అధికారులు ఉన్నారు. ఉపాధి హామీ పథకం కింద పని కావాలని ముందుకు వచ్చే ట్రాన్స్‌జెండర్లను ఒక్కో వ్యక్తిని ఒక్కో కుటుంబంగా గుర్తించి జాబ్ కార్డులు మంజూరు చేయనున్నారు. అలాగే ఒకే పంచాయతీ పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువమంది ట్రాన్స్ జెండర్లు ఉపాధి హామీ పనుల కోసం ముందుకొస్తే వారిని శ్రమశక్తి సంఘాలుగా గుర్తిస్తామని అధికారులు తెలిపారు.
మరోవైపు సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్నామని, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని.. తమకు ఉపాధి కల్పించాలంటూ గతకొంతకాలంగా ట్రాన్స్‌జెండర్లు కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంంలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వశాఖ.. ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధిహామీ పథకాన్ని అమలు చేయాలని సూచించింది. దీంతో
ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి.. ట్రాన్స్‌జెండర్లకు జాబ్ కార్డులు ఇవ్వాలంటూ మార్చి 15న ఏపీవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం పంపిన సర్క్యులర్ ప్రకారం ట్రాన్స్‌జెండర్‌ను కుటుంబంగా పరిగణించి జాబ్ కార్డు అందజేయాలి. అలాగే దరఖాస్తు ఫారమ్‌లో కూడా పురుషులు, స్త్రీలతో పాటు ట్రాన్స్‌జెండర్ కాలమ్ ఉంచాలి. గ్రామపంచాయతీలో ఐదుగురు కంటే ఎక్కువమంది ట్రాన్స్‌జెండర్లు ఉంటే వారిని శ్రమశక్తి సంఘంగా గుర్తించాలి. అలాగే పని ప్రదేశాల్లో వారిని కించపర్చే విధంగా మాట్లాడడం, వెకిలి చేష్టలు చేయడాన్ని నేరంగా పరిగణించాలి. ఇక ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి మండల, జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్లను నియమించాలని.. వారి ద్వారా పని ప్రదేశాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.