వైజాగ్ డ్రగ్స్ వ్యవహారానికి సంబందించి టీడీపీ, వైసీపీ, బీజేపీలపై షర్మి ల విమర్శలు గుప్పించారు. అసలు ఆ మూడు పార్టీలకు అసలు సిగ్గుందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్లో షర్మిల పోస్టు పెట్టారు. దేశానికి అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్‌ను.. ఉడ్తా ఆంధ్రప్రదేశ్‌గా మార్చారంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఇండియాలో ఏ మూల డ్రగ్స్ దొరికినా దాని మూలాలు మాత్రం ఏపీలో కనిపిస్తున్నాయని ఆరోపించారు.
"ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ. ఇప్పుడు డ్రగ్స్ సప్లై చేసే డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.గంజా, హెరాయిన్, కొకైన్ ఏది కావాలంటే అది దొరికే ఉడ్తా ఆంధ్రప్రదేశ్.ఇండియాలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపి వైపే. మొదటి 5 ఏళ్లు టీడీపీ,తర్వాత 5 ఏళ్లు వైసీపీ.10 ఏళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా మార్చేశారు. డ్రగ్స్ రవాణా, వాడకంలో నెంబర్ 1 ముద్ర వేశారు." అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
ఇక 25 వేల కేజీల డ్రగ్స్‌తో కంటైనర్ విశాఖతీరానికి చేరితే పార్టీలన్నీ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని షర్మిల ఆరోపించారు.
"25 వేల కేజీల భారీ మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే.. తమ తప్పు ఏమీ లేదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీలకు సిగ్గుండాలి. కేంద్ర రాష్ట్రాల నిఘా వ్యవస్థ సపోర్ట్ లేకుండా...వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయి ? డ్రగ్స్ మాఫియాతో మీకు లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా ? మీ అండదండలతోనే కదా డ్రగ్స్ రవాణాలో ఏపి "సేఫ్ హెవెన్" గా మార్చింది?" అని షర్మిల ట్వీట్లో పేర్కొన్నారు.
ఇక వైజాగ్ డ్రగ్స్ వ్యవహారంలో తెర వెనుక ఎంతటి వాళ్లున్నా నిజాలు నిగ్గు తేల్చాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ కేసులో వాస్తవాలను సీబీఐ బయటపెట్టాలన్నారు. ఆసియాలోనే అతి పెద్ద డ్రగ్ డీల్ గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు,పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.