మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. జైలు నుంచే పాలన సాగిస్తారని ఆప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గత మూడు రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న ఆయన.. జైలు నుంచే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆదివారంతొలి ఉత్తర్వును సీఎం వెలువరించారు. ఢిల్లీలో తాగునీటి సరఫరాకు సంబంధించిన ఈ ఉత్తర్వును నీటి వనరుల శాఖ మంత్రి అతీషికి కేజ్రీవాల్ పంపారు. సీఎం నుంచి నోట్ వచ్చిన కాసేపటికే మంత్రి అతీషి మీడియా సమావేశం ఏర్పాటుచేసి.. బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు భావోద్వేగానికి గురయ్యారు.
‘‘ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నగరంలోని నీటి సరఫరాపై ఆరా తీశారు. కొన్ని ప్రాంతాల్లో సమస్య ఉందని తెలుసుకుని అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.. ఏయే ప్రాంతాల్లో అయితే సమస్య ఉందో అక్కడ సరిపడా వాటర్ ట్యాంక్‌లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన తన గురించి ఆలోచించడంలేదు.. ఢిల్లీ ప్రజల సమస్యల గురించే ఆరా తీస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేసినంత మాత్రాన ఢిల్లీ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు’’ అని అతిషి కన్నీళ్లు పెట్టుకున్నారు.
‘వేసవి వచ్చేసింది.. కాబట్టి దయచేసి నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో తగినన్ని ట్యాంకర్లను ఉండేలా చూసుకోండి... ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వండి.. ప్రజల సమస్యలకు తక్షణమే సరైన పరిష్కారం చూపాలి.. అవసరమైతే దయచేసి లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి సహాయం తీసుకోండి. ఆయన మీకు తప్పకుండా సహాయం చేస్తాడు’ అని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు.
అరెస్టు చేసినా కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆప్ స్పష్టం చేసింది. ఏ చట్టం ఆయన్ను అడ్డుకోనప్పటికీ, జైలు నిబంధనలు ఇబ్బందికరంగా మారాయి. ఢిల్లీలోని తీహార్ జైలు మాజీ న్యాయ అధికారి మాట్లాడుతూ.. ఒక ఖైదీ వారానికి రెండు సమావేశాలు మాత్రమే నిర్వహించగలడు.. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపటం ప్రభావవంతంగా ఉండదు. జైలు నిబంధనలు మీరు వారానికి రెండుసార్లు మాత్రమే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహచరులను కలుసుకోవచ్చని పేర్కొంటున్నాయి... కాబట్టి ఈ ఆంక్షలతో ఆయన పాలన చేయడం అంత సులభం కాదు’ అని చెప్పారు.
అయితే, ఒక మార్గం ఉంది. కేజ్రీవాల్‌ను గృహనిర్బంధంలో ఉంచడానికి అధికారులను కోరితే ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చు. అయితే దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమోదం అవసరం అని తెలిపారు. అంతేకాదు, ఏదైనా భవనాన్ని జైలుగా ప్రకటించే అధికారం జైలు యంత్రాంగానికి లేదన్నారు.