లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు సంబంధించిన నాలుగో జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం ప్రకటించింది. మొత్తం 46 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా ప్రచురించగా.. వీరిలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం డిగ్గీ రాజాతో పాటు వారణాసిలో మోదీ ప్రత్యర్ధి ఉన్నారు. వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్తిగా ఉత్తర్ ప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు అజయ్ రాయ్, సహరాన్‌పూర్ నుంచి ఇమ్రాన్ మసూద్, హరిద్వార్ నుంచి ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ తనయుడు వీరేందర్ రావత్‌లకు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. అలాగే, తమిళనాడులోని శివగంగైన నుంచి సీనియర్ నేత చిదంబరం తనయుడు కార్తీ, విరుద్‌నగర్ నుంచి మాణికం ఠాగూర్‌లను పోటీకి నిలిపింది.
వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోదీపై అజయ్ రాయ్ పోటీ చేయడం ఇది మూడోసారి. గత బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన డానిశ్ అలీకి కూడా టిక్కెట్ దక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ నుంచి పీఎల్ పూనియా తనయుడు తనుజా పూనియా, జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్ నుంచి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌పై చౌదరి లాల్ సింగ్, జమ్ము నుంచి జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ్ భల్లా అభ్యర్థిత్వం ఖరారు చేసింది. తాజా జాబితాతో ఇప్పటివరకు మొత్తం 184 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించినట్లయింది.
అయితే, పార్టీకి కంచుకోటలైన అమేధీ, రాయబరేలీ అభ్యర్థుల విషయంలో సస్పెన్ష్ కొనసాగుతోంది. ఆ రెండు స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీకి అమేధీలో ఓటర్లు షాకిచ్చారు. ఆయనపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విజయం సాధించారు. ఈసారి కూడా అక్కడ బీజేపీ ఆమెకే సీటు ఇచ్చింది. రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్‌తో పాటు అమేధి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక, సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవడంతో ఆమె పోటీచేస్తోన్న రాయబరేలిలో ఎవరికి టిక్కెట్ ఇస్తారనే ఉత్కంఠ నెలకుంది. ప్రియాంక గాంధీ పోటీచేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక, యూపీలోని మొత్తం 80 స్థానాలకుగానూ సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ పొత్తులో భాగంగా హస్తం పార్టీ 17 చోట్ల పోటీ చేస్తోంది.
ఇక, దిగ్విజయ్ సింగ్‌కు మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ను కేటాయించారు. డిగ్గీ రాజా చివరిసారిగా 1991 సాధారణ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే, 2019లో ఎన్నికల్లో భోపాల్ నుంచి పోటీచేసిన ఆయన.. సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ చేతిలో ఓటమి చవిచూశారు. ఏకంగా ఆమె 3.5 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని 29 సీట్లలో కాంగ్రెస్ ఒక్కటి మాత్రమే గెలించింది. దీంతో ఆయన పునరాగమనం బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేయగలదని భావిస్తున్నారు.