బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేరుకున్నారు. ప్రచార షెడ్యూల్‌పై ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. నిన్న ఆరు పార్లమెంటు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. నేడో, రేపో పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. బీజేపీ సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు రానున్నారు. వచ్చే నెల ఐదు నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురందేశ్వరి ప్రచారం ప్రారంభించనున్నారు. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్న 10 అసెంబ్లీ, ఆరు లోక్‌సభ సీట్లకు అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలిసింది. శనివారం ఢిల్లీలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సోము వీర్రాజు... ఆ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్‌చార్జులు అరుణ్ సింగ్, సిద్ధార్థ నాథ్‌తో భేటీ అయ్యారు. పొత్తు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. ఏపీలో 10 అసెంబ్లీ, ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను హైకమాండ్‌కు అందించినట్టు తెలిసింది. తిరుపతి, అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నరసాపురం, విజయనగరం లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలిసింది. బీజేపీ ప్రకటించే ఐదో జాబితాలో ఏపీ నుంచి ఆరుగురు లోక్‌సభ అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశముంది.