శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మాజీ కౌన్సిలర్ పరికి షామీర్.. వహీద అనే ముస్లిం మహిళను మంగళవారం చెప్పుతో కొట్టారు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసు స్టేషన్ వద్ద బైఠాయించారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు, పరికి షామీర్.. పట్టణంలోని మశానంపేటకు చెందిన వహీదాను పదిమందితో ప్రచారానికి రావాలని పిలిచారు. ఒక్కో మహిళకు రూ.300 ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వహీదా 15మందిని ప్రచారానికి తీసుకెళ్లారు. ప్రచారం పూర్తయ్యాక అందరూ అభ్యర్థి మగ్బూల్ ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆగ్రహించిన షామీర్, తాను పదిమందిని తీసుకురమ్మని చెబితే 15మందిని తీసుకొస్తావా? అంటూ బూతులు తిట్టారు. పదిమందికే డబ్బులు ఇవ్వాలని కోరినా పట్టించుకోకుండా రంజాన్ వేళ బూతులు తిట్టారని బాధితురాలు వాపోయారు. అంతటితో ఆగకుండా చెప్పు తీసుకుని తన తలపై కొట్టారని కన్నీరు పెట్టుకున్నారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనకు న్యాయం చేయాలని కోరుతూ నిరసనకు దిగారు.