విశాఖపట్నం, వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఆర్థిక సంవత్సరం ఇంకా పూర్తికాకముందే రూ.10 వేల కోట్ల ఆదాయం సాధించింది. ఇది గత ఏడాది కంటే పది శాతం అధికమని డీఆర్‌ఎం సౌరభ్ ప్రసాద్ మంగళవారం వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం (2022-23) మార్చి 25వ తేదీ నాటికి రూ.9,113 కోట్ల ఆదాయం నమోదుచేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) ముగియడానికి ఇంకా ఐదు రోజుల వ్యవధి ఉండగానే రూ.10 వేల కోట్లు దాటింది. డివిజన్‌చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలవనుంది. వినియోగదారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వ్యూహాలు రూపొందించడం, వారితో కలిసి పనిచేయడం, ప్రయాణికులకు వసతులు పెంచడం, క్రూ మేనేజ్‌మెంట్ పనితీరు బాగుండడం తదితర కారణాల వల్ల ఈ ఆదాయం సాధించగలిగామని డీఆర్‌ఎం వివరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు, భద్రతకు సంబంధించిన పనుల వల్ల సాధారణ రాకపోకలకు కొంత అంతరాయం కలిగినా ఈ వృద్ధిని సాధించడం విశేషమని ఆయన అధికారులు, సిబ్బందిని అభినందించారు.