ఏపీ రాజకీయాల్లో కొద్దిరోజుల క్రితం టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు హడావిడి కనిపించింది. వైఎస్సార్‌సీపీలో చేరిన ఆయన.. ఆ తర్వాత యూటర్న్ తీసుకుని బయటకు వచ్చారు. మళ్లీ పవన్ కళ్యాణ్‌ను కలిసి మద్దతు పలికారు.. దీంతో జనసేన పార్టీలోకి వెళతారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత అంబటి రాయుడు రాజకీయాల్లో ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి మరోసారి అంబటి రాయుడు పేరు తెరపైకి వచ్చింది.. ఆయన చేసిన ట్వీట్‌తో మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరతారా అనే చర్చ మొదలైంది.
అంబటి రాయుడు ఎక్స్ (ట్విట్టర్)లో ఓ ట్వీట్ చేశారు. ఇవాళ వేకువజామున 3 గంటల సమయంలో సిద్ధం అంటూ ఒక పదంతో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అంబటి రాయుడు తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరతారా అనే ప్రచారం మొదలైంది. అంతేకాదు సిద్ధం అని ట్వీట్ చేయడంతో.. నేటి నుంచి వైఎస్సార్‌సీపీ ప్రారంభిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభంకానుంది. ఈ సమయంలో రాయుడు సిద్ధం అంటూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. కొందరు నెటిజన్లు మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరతారా అంటూ రాయుడిని ప్రశ్నిస్తున్నారు.
గతేడాది డిసెంబర్‌లో అంబటి రాయుడు వైఎస్సార్‌సీపీలో చేరారు. జనవరి 6న ఆయన వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. జనవరి 20 నుంచి దుబాయ్‌లో జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఎంఐ ఎమిరేట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పారు. వృత్తిపరమైన క్రికెట్ ఆడుతున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరముంది అన్నారు.
వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. అనంతరం ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. స్వచ్ఛమైన మనసు, ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాననన్నారు. తన ఆలోచనలు, కలలు సాకారమవుతాయని వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు. క్షేత్రస్థాయిలో అనేక గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నానని.. వ్యక్తిగతంగా సాధ్యమైనంత మేరకు సాయం చేశానన్నారు. కొన్ని కారణాల వల్ల వైఎస్సార్‌సీపీతో కలసి ముందుకెళ్తే.. తాను అనుకున్న లక్ష్యాలను సాధించలేనని అర్థమైంది అన్నారు. ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టడం లేదని.. తన ఆలోచన, వైఎస్సార్‌సీపీ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయన్నారు. ఎన్నికల్లో ఫలానా స్థానం నుంచి పోటీ చేయాలని అనుకోలేదన్నారు.
తాను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నానని.. కానీ నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి పవన్‌ను కలవమని తన స్నేహితులు, శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారని చెప్పుకొచ్చారు అంబటి రాయుడు. ఆయన సిద్ధాంతాల గురించి తెలుసుకోమన్నారని.. అందుకే పవన్‌ను కలసి మాట్లాడినట్లు తెలిపారు. జీవితం, రాజకీయాలతో పాటు ఆయన్ను అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించానని.. తమ ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయన్నారు. ఆయన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ కోసం త్వరలోనే దుబాయ్ వెళ్తున్నట్లు చెప్పారు.. తాను ఎక్కడ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉంటానన్నారు. అంటి రాయుడికి గుంటూరు ఎంపీ టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరిగింది. అందుకే ఆయన వైఎస్సార్‌సీపీలో చేరినట్లు ఊహాగానాలు వినిపించాయి.