జనసేన పార్టీ నేతల్ని హెచ్చరించారు పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు. జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయమే అంతిమం అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించిన అనంతరం పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వస్తారు అనే విషయం అందరూ అర్థం చేసుకోవాలి అన్నారు. అధ్యక్షులు ఒకసారి నిర్ణయం తీసుకున్న తరవాత అందుకు విరుద్ధంగా బహిరంగ వేదికలు, మీడియా, సామాజిక మాధ్యమాలలో మాట్లాడితే అది పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించడమవుతుంది అన్నారు. ఇటువంటి అంశాలపై పార్టీ కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగం బాధ్యులతో చర్చించి, సంబంధిత వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.
మరోవైపు పార్టీ నిర్వహణ అవసరాల కోసం రూ.10 కోట్లు స్వార్జితాన్ని విరాళంగా అందజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఉన్నతి కోసం మొదటి నుంచీ తన స్వార్జితాన్ని పార్టీ కోసం వెచ్చిస్తూ వస్తున్న జనసేనాని.. ఇప్పుడు మరోసారి సినిమాల ద్వారా తాను సంపాదించిన డబ్బులో రూ.10 కోట్లను పార్టీకి ఫండ్‌గా ఇచ్చారు. ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నంకు మంగళవారం చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సంగ్రామాన్ని ముందుకు నడపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చేవారని గుర్తుచేశారు. ఆ రోజుల్లో తమ సొంత డబ్బును వెచ్చించిన తీరు గొప్పదని కొనియాడారు. ఓ సదాశయం కోసం, రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా ఇప్పుడు ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం 10 కోట్ల రూపాయలను అందజేస్తున్నానని పవన్ చెప్పారు. ఇది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నానన్నారు.
జనసేన ప్రస్థానంలో ప్రవాసాంధ్రుల సహకారం విలువైందన్నారు నాగబాబు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న జనసేనకు ప్రజలు, ముఖ్యంగా విదేశాలలో స్టిరపడిన వారు వెన్నంటి ఉంటున్నారన్నారు. పవన్ కళ్యాణ్ సదాశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడంలో జన సైనికులు, వీర మహిళల ఎంతో క్రియాశీలకంగా ఉంటున్నారని తెలిపారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నాగబాబును అరిగే వెంకటరత్నం జనసేన పార్టీకి రూ. 5 లక్షలు సహకారం అందజేశారు. కాలిఫోర్నియాలో స్థిరపడిన అరిగే ఈశ్వర్ తమ తల్లి అరిగే వెంకటరత్నం పేరు మీద ఈ సహకారం అందించారు. కుటుంబ సభ్యులు పొన్నెగంటి మస్తాన్ రావు , వరలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరిగే వెంకటరత్నం కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరపున నాగబాబు అభినందన పత్రం అందజేశారు.