వైసీపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని భావించిన అన్నా రామచంద్రయ్య యాదవ్.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాదవ సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి మేయర్‌కు ప్రోటోకాల్ దక్కడం లేదన్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తన ఇంటికి వచ్చి తన కుమార్తెకు మేయర్ పదవి ఇస్తానని ప్రమాణం చేసి మాట తప్పారని విమర్శించారు. తమ కుటుంబానికి తిరుపతితో 50 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. కరుణాకర్ రెడ్డి కడప జిల్లా నుంచి తిరుపతికి వలస వచ్చిన మాట వాస్తవం కాదా? అన్నారు. వైసీపీలో తన బిడ్డలు ఇద్దరు వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల సవాలు స్వీకరించి.. తన ఇద్దరు కుమార్తెలు రాజీనామా చేశారన్నారు. తమ కుటుంబం భూములు అక్రమించారని వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం సరికాదని..తగిన ఆధారాలు చూపాలన్నారు. విశ్వాసం లేని భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తులను అందలం ఎక్కించినందుకు తీవ్రంగా చింతిస్తున్నానని అన్నా రామచంద్ర యాదవ్ అన్నారు.