ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ(63) గుండెపోటుతో మరణించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2005 నుంచి జైలులో ఉన్నారు. ఆయన మృతికి సంబంధించి అధికారులు మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. యూపీలోని బండా జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్సారీ గురువారం రాత్రి 8.25 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు.
వాంతులు చేసుకోవడంతో దుర్గావతి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించగా, స్పృహ కోల్పోయాడని, చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందినట్లు బులెటిన్లో పేర్కొన్నారు. అన్సారీ మృతితో ఆస్పత్రి చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా బలగాలను మోహరించినట్లు యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.