ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకొంది. ఏప్రిల్ 1వ తేదీన వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరోవైపు జగన్ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వేరొక పిటిషన్‌ను సైతం రఘురామకృష్ణ రాజు అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. దీంతో ఈ 2 పిటిషన్లపై ఏప్రిల్ 1న విచారణ జరగనుంది. అయితే ఎన్నికల వేళ.. సీఎం వైయస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుండడం.. అనంతరం ధర్మాసనం తీసుకునే నిర్ణయంపై సర్వత్ర దృష్టి కేంద్రీకరించనుంది. అదీకాక వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకోవాలని జగన్ కలలు కంటున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ పరదాల చాటున తిరిగిన ఆయన ఎన్నికలు వచ్చే సరికి ‘మేము సిద్దం’ పేరిట జనల్లోకి అడుగుపెట్టారు. మార్చి 27న ఇడుపులపాయ నుంచి ప్రచారం ప్రారంభించారు. ఈ యాత్ర 21 రోజుల పాటు సాగనుంది. అలాంటి పరిస్థితుల్లో జగన్ అక్రమాస్తుల కేసు అంశంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.