జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా తన ప్రచారానికి ఈనెల 30వ తేదీన శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి వారాహి విజయభేరి మోగించనున్నారు. ఆ రోజు సాయంత్రం 4గంటలకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు రామాలయం సెంటర్‌లో జరిగే సభలో వారాహి వాహనంపై నుంచి పవన్ ప్రసంగించునున్నారు. పవన్‌కల్యాణ్ తాను పోటీ చేయనున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారికంగా సమాచారం అందింది. ఆ మేరకు పార్టీ నాయకులు అనుమతులు కోసం పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోకు, పోలీసులకు గురువారం సాయంత్రం దరఖాస్తు చేశారు. 30వ తేదీన హెలికాప్టర్‌లో పవన్‌కల్యాణ్ గొల్లప్రోలు పట్టణ శివారులోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి పుర్హుతికాశక్తి పీఠానికి చేరుకుని వారాహి వాహనానికి పూజలు నిర్వహిస్తారు. దత్త పీఠాన్ని దర్శించుకుంటారు. అనంతరం పిఠాపురం మండలం కుమారపురంలోని ప్రైవేటు హోటల్‌కు చేరుకుని అక్కడ బసచేసి సాయంత్రం వారాహి వాహనంపై గొల్లప్రోలు మండలం చేబ్రోలు చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 4గంటలు నుంచి జరిగే వారాహి విజయభేరి యాత్రలో పాల్గొని సభకు హాజరయిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని కేంద్ర కార్యాలయం నుంచి సూచనలు జారీ కావడంతో ఏర్పాట్లు చేయడంలో జనసేన నాయకులు నిమగ్నమయ్యారు. కాగా పవన్ రాష్ట్రవ్యాప్త ప్రచారానికి వినియోగించే వారాహి వాహనం గురువారం రాత్రి కాకినాడ చేరుకుంది.