ఏపీలో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల విధులపై సీఈసీ ఆంక్షలు విధించింది. ఈ మేరకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు లేఖ రాసింది. పింఛన్ల పంపిణీ సహా లబ్ధిదారులకు నగదును అందించే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లను వినియోగించొద్దని లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ ముగిసేంతవరకూ వారి చేత పింఛన్ల పంపిణీ చేయించవద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకూ వాలంటీర్లతో నగదు పంపిణీ వద్దని సీఈసీ స్పష్టం చేసింది. మరోవైపు ఎన్నికల కోడ్ ముగిసే వరకూ వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, ట్యాబులు స్వాధీనం చేసుకోవాలని సీఈసీ అదేశాలు జారీ చేసింది. నగదు పంపిణీ పథకాల్లో అవసరమైతే.. ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవాలని సూచించింది. లేదా నగదు బదిలీ ద్వారా పథకాల లబ్ది పంపిణీ చేయవచ్చని సీఈసీ ఆదేశించింది.
మరోవైపు ఏప్రిల్ నెలకు సంబంధించి ఒకటో తేదీన కాకుండా మూడో తేదీన పింఛన్ పంపిణీ చేయనున్నారు. సీఈసీ తాజా ఆదేశాల నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుపై ఆలోచనలు చేస్తున్నారు. నగదు బదిలీ ద్వారా పింఛన్లు జమచేసే విషయమై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పింఛన్ పంపిణీ ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. జూన్ నాలుగో తేదీన ఏపీ ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ ఈ మూడు నెలలు కూడా పింఛన్ పంపిణీలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
మరోవైపు పింఛన్ల పంపిణీపై సెర్ప్ సైతం ఇటీవల వాలంటీర్లకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పింఛన్లు అందించే వాలంటీర్ల ఆథరైజేషన్ లెటర్లు తీసుకోవాలని సెర్ప్ సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఈలోపే సీఈసీ పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.