పార్వతీపురం మన్యం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కలకాలం కలిసి ఉండాలని వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఓ కొత్తజంటను విధి చిన్నచూపు చూసింది. పెళ్లి జరిగిన కాసేపటికే వధువు అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోవటం రెండు కుటుంబాలను కలచి వేసింది. పెళ్లికి వచ్చిన బంధువులను సైతం దిగ్ర్భాంతికి గురి చేసింది.
వివరాల్లోకి వెళ్తే... పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగడ్డ గ్రామానికి చెందిన అఖిల (20)కు శుక్రవారం వివాహమైంది. శుక్రవారం రాత్రి పదిగంటల సమయంలో వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన కాసేపటికి నీరసంగా ఉందని కుటుంబసభ్యులకు చెప్పిన వధువు అఖిల.. కాసేపటికే నిద్రలోకి జారుకుంది. ఆ తర్వాత బంధువులు పిలిచినా అఖిల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో కుటుంబసభ్యులు కంగారుపడిపోయారు. అఖిల అపస్మారకస్థితిలోకి వెళ్లటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స కేంద్రంలో పరిశీలించిన ఆరోగ్య సిబ్బంది.. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని సూచించారు .
దీంతో కుటుంబసభ్యులు వెంటనే అఖిలను సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ పరిశీలించిన సాలూరు ప్రభుత్వ ఆస్పత్రిక వైద్యులు..అప్పటికే అఖిల చనిపోయినట్లు ధ్రువీకరించారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లి కోసం వేసిన పందిళ్లు వాడకముందే, కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు చనిపోవటం రెండు కుటుంబాలతోపాటు గ్రామస్థులను సైతం దిగ్ర్భాంతికి గురి చేసింది. అప్పటి దాకా చలాకీగా ఉన్న అమ్మాయి హఠాత్తుగా చనిపోవటాన్ని కుటుంబసభ్యులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనతో శుభకార్యం జరిగిన ఆ ఇంట్లో కాసేపటికే విషాదఛాయలు అలుముకున్నాయి.