ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.. ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించి ప్రజల్లోకి వెళుతున్నాయి. ఆయ పార్టీల అధినేతలు, అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. ఇటు చంద్రబాబు ప్రజా గళం పేరుతో రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో సభలకు హాజరవుతున్నారు. ఎన్నికల ప్రచారం, తాజా పరిణామాల.. ఇలా ఏపీలో ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
* జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. జనసేనాని ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. తొలి విడతలో భాగంగా మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు పవన్ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ గ్రామీణం, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో పర్యటిస్తారని మనోహర్ తెలిపారు.
* శుక్రవారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర పెంచికలపాడులోని రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభమయ్యింది. ఈ యాత్ర పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి సాగింది. అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సభ అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బెణిగేరి, ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాల్‌కి దగ్గరలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు.