ఏపీలో పునర్వైభవం కోసం తపిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని భావిస్తోంది. వైసీపీ,టీడీపీ కూటమి హోరాహోరీగా తలపడుతున్న వేళ.. హస్తం పార్టీ సైతం సత్తాచాటాలని బలంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితా తయారీ పూర్తి కాగా.. ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఓటర్లను ఆకర్షించేందుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పిస్తోంది. కర్ణాటక, తెలంగాణలో వర్క్ అవుట్ అయిన గ్యారెంటీల తరహాలోనే ఏపీలోనూ 9 గ్యారంటీలు అమలు చేస్తామంటోంది కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో తమను ఆశీర్వదిస్తే 9 సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెబుతూ వస్తున్నారు.
ఇక ఏపీ కాంగ్రెస్ ప్రకటించిన తొమ్మిది గ్యారెంటీల విషయానికి వస్తే.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. అలాగే మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద మహిళలకు ప్రతి నెల 8,500 చొప్పున ఏడాదికి లక్ష రూపాయలు సాయం అందిస్తామని షర్మిల హామీ ఇచ్చారు. మూడో గ్యారంటీగా రైతులకు రూ.2 లక్షల వరకూ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అన్నదాతలకు పెట్టుబడి మీద 50 శాతం లాభంతో మద్దతుధర అందిస్తామనేది నాలుగో గ్యారెంటీ కాగా.. ఉపాధి హామీ పథకం కూలీల కనీస వేతనం రూ.500లకు పెంచుతామని కాంగ్రెస్ ఐదో గ్యారంటీ ఇచ్చింది.
కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య, 2.25లక్షల ఉద్యోగాల భర్తీ. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి రూ. 5 లక్షలతో పక్కా ఇల్లు , అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.4000 పింఛన్, దివ్యాంగులకు రూ.6000 పింఛన్‌లను మిగతా గ్యారంటీలుగా ఏపీ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ తొమ్మిది గ్యారంటీల ద్వారా ఏపీలో సత్తా చాటాలని హస్తం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. మరి హస్తం పార్టీ 9 గ్యారంటీలు ఏ మాత్రం ఫలితాన్ని ఇస్తాయనేది జూన్ 4వ తేదీ తేలనుంది.