తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. బండారు సత్యనారాయణమూర్తికి ఈసారి కూటమిలో టికెట్ దక్కలేదు. 2024 ఎన్నికల్లో పెందుర్తి నుంచి టీడీపీ తరుఫున పోటీ చేయాలని బండారు భావించారు. అయితే పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. జనసేన తరఫున పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ రాకపోవటంతో బండారు అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. ఒక దశలో వైసీపీ తరుఫున అనకాపల్లి ఎంపీ సీటుకు పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే పార్టీ మార్పుపై ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ ఇవ్వని బండారు సత్యనారాయణమూర్తి.. తాజాగా పెదవి విప్పారు.
స్వగ్రామం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలెంలో బండారు సత్యనారాయణమూర్తి శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన బండారు ఆవేదన చెందారు.ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకూ టీడీపీ కోసం ఎన్నో ఉద్యమాలు చేశానని బండారు అన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సీఎం జగన్‍లతో పోరాటం చేశానన్న బండారు.. ఏం పాపం చేశానని టీడీపీ తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 45 సంవత్సరాలు సుధీర్ఘంగా పార్టీ కోసం కష్టపడ్డానని.. ఏ రోజూ పార్టీకి అన్యాయం చేయలేదన్నారు. టీడీపీ పదవులు ఇవ్వకపోయినా పార్టీకి ఎప్పుడూ విధేయంగానే ఉన్నానని బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తనపై 11 కేసులు బనాయించిందనీ.. అయినా పార్టీ కోసమే పనిచేశానని చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితుల్లో పార్టీలు మారిన వ్యక్తులకు పెందుర్తి సీటు ఎలా ఇస్తారని బండారు ప్రశ్నించారు. పార్టీ నిర్ణయంతో తనకు 20 రోజులుగా నిద్రలేదని బండారు ఆవేదన వ్యక్తం చేశారు .
మరోవైపు పార్టీ మార్పు వార్తలపైనా బండారు క్లారిటీ ఇచ్చారు. టీడీపీ తనకు సీటు కేటాయించకపోయినా పర్వాలేదని.. కానీ తాను మాత్రం పార్టీ మారడం లేదన్నారు. పార్టీ మార్పు వార్తలంతా దుష్ర్పచారామని కొట్టిపారేశారు. నా కట్టె కాలేంతవరకూ టీడీపీలోనే ఉంటానని.. చనిపోయిన తర్వాత కూడా చితి మీద పసుపు జెండా వేసి కాల్చాలని భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ నుంచి ఆఫర్‌లు వచ్చిన మాట వాస్తమేనన్న బండారు.. అయినా తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తనకు పదవులు కంటే పార్టీని అధికారంలోకి తేవడమే ముఖ్యమని బండారు సత్యనారాయణమూర్తి తేల్చిచెప్పారు.