త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీని ఎన్డీయే కూటమి ఎదుర్కోనుంది. ఇప్పటికే కూటమిలోని మూడు పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తి కాగా.. అభ్యర్థులను సైతం ప్రకటించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకోగా.. 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. 2024 ఎన్నికల ముందు బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదిరినప్పటికీ.. సీట్ల పంపకం విషయంలో టీడీపీ శ్రేణులు ఒకింత అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పొత్తు ఎన్నికల వరకు మాత్రమేనని టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాసిన లేఖ అంటూ.. సోషల్ మీడియాలో ఓ లెటర్ వైరల్ అవుతోంది.
తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే విషయంలో పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. సీట్ల పంపకాలపై తుది చర్చలు ముగిసిన దృష్ట్యా.. ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించాలి. గతంలో మనం విభేదించిన భారతీయ జనతా పార్టీతో పొత్తు అనవసరం అని కొందరు భావిస్తున్నారు. కానీ, ఎన్నికల వరకే భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. కేంద్రంలో తిరిగి ఎన్డీఏ కూటమి ఏర్పడితే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో విభేదించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏపీకి తలమానీకమైన పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వని భాజపా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పదేండ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తాం. ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చకుండా భాజపా తీరని అన్యాయం చేసింది. తెలుగుదేశం పార్టీ స్పెషల్ ప్యాకేజీని ఒప్పుకోలేదు. చివరి వరకు ప్రత్యేక హోదా కోసమే పోరాటం చేసింది. హైదరాబాద్ వల్ల నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా స్పెషల్ ప్యాకేజీ పేరుతో రెండు పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టిన కేంద్రాన్ని ఆంధ్రా ప్రజలు మర్చిపోలేదు. మూడు పార్టీల మధ్య స్నేహపూర్వక బంధం ఎన్నికల వరకు మాత్రమే కొనసాగుతుంది. తెదేపా శ్రేణులు, తెలుగు తమ్ముళ్లు కూటమి గెలుపు కోసం కృషి చేయాలి’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
నిజ నిర్ధారణ జరిగిందిలా..
టీడీపీ, బీజేపీ పొత్తుపై తెలుగుదేశం శ్రేణులకు చంద్రబాబు నాయుడు రాసినట్లు వైరల్ అవుతోన్న లేఖ నకిలీదని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. టీడీపీ, ఆ పార్టీకి చెందిన నేతల సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ లేఖ కోసం వెతకగా కనిపించలేదు. అదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మరిన ఈ లేఖ ఫేక్ అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇది మాత్రమే కాకుండా.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎన్టీయే కూటమికి 400 సీట్లు వస్తాయని.. రాష్ట్రంలో 25కి 25 సీట్లు వస్తాయని చంద్రబాబు మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించడం కోసం.. బీజేపీకి మద్దతు ఇవ్వాలని కూడా టీడీపీ శ్రేణులను చంద్రబాబు కొన్ని సందర్భాల్లో కోరడం కనిపించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్తులో కూడా బీజేపీతో కలిసి టీడీపీ పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మరో కీలక విషయం ఏంటంటే.. వైరల్‌గా మారిన లేఖలో తేదీని గమనిస్తే.. 20-23-2024 అని రాసి ఉంది. దీన్ని బట్టి ఈ లేఖ నకిలీదని నిర్ధారించొచ్చు. బీజేపీతో పొత్తు కారణంగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కోల్పోతున్న కొందరు టీడీపీ నేతలతోపాటు, వారి అనుచరగణంలో అసంతృప్తి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు వారితో మాట్లాడి నచ్చజెబుతున్నారు. వీటిన్నింటిని బట్టి.. వైరల్ అవుతోన్న లేఖ నకిలీదని నిర్ధారించడం జరిగింది. వైరల్ అవుతోన్న లేఖలో తేదీ తప్పుగా పేర్కొనడం, అది టీడీపీ నేతల సోషల్ హ్యాండిల్స్‌లో ఎక్కడా కనిపించకపోవడంతోపాటు.. తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా అది ఫేక్ లెటర్ అని పేర్కొనడంతో.. వైరల్ లెటర్ నకిలీదని స్పష్టమైంది.