ఏపీ ఎన్నికల వేళ నిరుద్యోగులకు షాక్ తగిలింది. డీఎస్సీ, ఉపాధ్యాయ నియామక పరీక్ష (టెట్)ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసేంత వరకూ డీఎస్సీ పరీక్ష, టెట్ పరీక్షా ఫలితాల వెల్లడిని వాయిదా వేయాలని సూచించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా... కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారు.
మరోవైపు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. అలాగే మార్చి 14 టెట్ పరీక్షల ఫలితాలు ప్రకటించాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. ఇక డీఎస్సీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపింది.
ఏపీ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మే 13న ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేవరకూ నిరుద్యోగులు ఎదురు చూడకతప్పదు. ఎన్నికల షెడ్యూల్ వెలవడగానే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. ఫలితాల వెల్లడి వరకూ కొనసాగనుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితోనే ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది.