భూమిలో బోరు వేస్తే నీళ్లు ఉబికి వస్తాయి.. చెట్టును నరికితే నీళ్లు ఉబికి రావడాన్ని ఎప్పుడైనా చూశారా. కాస్త విచిత్రంగా ఉంది కదూ.. మీరు వింటున్నది నిజమే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ అరుదైన సన్నివేశం కనిపించింది. ఒక చెట్టు మొదలు నరుకుతుండగా నీరు ఉబికి వచ్చింది. పాపికొండల నేషనల్ ఫారెస్ట్ ఏరియాలో కింటుకూరు ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు అటవీశాఖ అధికారులు వెళ్లారు. అక్కడ నల్లమద్ది చెట్టు ఉండటాన్ని గమనించారు. ఆ చెట్టు నుంచి నీళ్లు చుక్కలు, చుక్కలుగా రావడాన్ని గమనించారు.
వెంటనే వెళ్లారు అటవీశాఖ అధికారులు చెట్టు కాడను నరకగా నీళ్లు వచ్చాయి. వెంటనే వారు చెట్టు బెరుడును నరకగానే.. చెట్టు నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. అలా వచ్చిన జలధార చూసిన అటవీ అధికారులు అవాక్కయ్యారు. ఆ చెట్టు నుంచి దాదాపు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని చెబుతున్నారు. చెట్టు నుంచి వచ్చిన నీళ్లను అటవీశాఖ అధికారులు తాగారు. ఈ చెట్టును జలధార వృక్షంగా చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.
గతంలో మనం చెట్టు నుంచి పాలు రావడం చూశాం.. ఎన్నో ఘటనలు జరిగాయి. వాతావరణంలో మార్పులతో పాటుగా ఆ చెట్టు లక్షణాల వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా చెట్టును నరకగానే నీళ్లు ఉబికి రావడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ జలధార వృక్షం వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.