బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని మరోసారి గెలిపించుకుని కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, కాషాయ దళం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఈసారి బీజేపీ 370 కిపైగా సీట్లు, ఎన్డీఏ 400 పైగా స్థానాలు దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సుదీర్ఘ పర్యటనలు చేస్తున్న ప్రధాని మోదీ.. ఎన్డీఏ కూటమి ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకుని విస్తృతంగా ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. తన ప్రసంగాల్లో కాంగ్రెస్ సహా దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటినీ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రధాని మోదీ విమర్శలకు ఆ పార్టీలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీపై తాజాగా తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
నరేంద్ర మోదీ కళ్లు కూడా ఆయన కన్నీళ్లన నమ్మవు అంటూ ఎంకే స్టాలిన్ ప్రధానిపై విరుచుకుపడ్డారు. తమిళ భాషను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో తమిళనాడు పర్యటనకు వచ్చిన సమయంలో ఇంగ్లీష్‌లో మాట్లాడే ప్రధాని ఇప్పుడు ఎందుకు హిందీలో మాట్లాడారని స్టాలిన్ ప్రశ్నించారు.
తనకు తమిళం ఎలా మాట్లాడాలో తెలియనందుకు తాను పశ్చాత్తాపపడుతున్నానని.. ప్రధాని నరేంద్ర మోదీ అన్నారని ట్విటర్ వేదికగా ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఇక్కడి అందమైన తమిళ పదం వనోలిని హిందీ పదం ఆకాశవాణిగా మార్చుతున్నట్లు నిన్నటి వార్తలు చెబుతున్నాయని తెలిపారు. ప్రధాని కన్నీటిని కూడా మోడీ కళ్లు కూడా నమ్మవని.. అలాంటిది తమిళనాడు ప్రజలు ఎలా నమ్ముతారని స్టాలిన్ ప్రశ్నించారు. మీరు మీ ఒక కంటిని పొడుచుకుంటూ, మరో కంటితో కన్నీరు కారుస్తున్నారని.. ఇది ఎలాంటి తమిళ ప్రేమ అంటూ స్టాలిన్ ట్వీట్ చేశారు.
దక్షిణాదిపై హిందీ భాషను.. కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీ రుద్దుతోందని ఇప్పటికే ఎన్నోసార్లు డీఎంకే పార్టీ, ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతీ చోట హిందీ, ఎందులోనైనా హిందీ అనే దాన్ని నరేంద్ర మోదీ సర్కార్ అవలంభించడం దురదృష్టకమరని స్టాలిన్ ఆరోపించారు. 2019 లో తమిళనాడు నుంచి వచ్చే విమానాల్లో ప్రకటనల కోసం తమిళ భాషను వాడుతామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రధాని నరేంద్ర మోదీని స్టాలిన్ ప్రశ్నించారు. విమానాలు పక్కన పెడితే తమిళనాడులోని ఎయిర్‌పోర్టుల్లో భద్రతా సిబ్బందికి కూడా తమిళం, ఇంగ్లీష్ తెలియడం లేదని తన ట్వీట్‌లో ఆరోపించారు. కులం, మతం, భాష ఆధారంగా ప్రజలను విభజించాలని బీజేపీ, ప్రధాని మోదీ చూస్తున్నారని సీఎం మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం రావాలంటే ఇండియా కూటమికి ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా స్టాలిన్ పిలుపునిచ్చారు.