ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కూటమి ఇండియా ఆదివారం నిరసన చేపట్టింది. ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీని తలపెట్టింది. కేజ్రీవాల్ అరెస్ట్ , కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులపై బీజేపీతో యుద్దానికి సిద్ధమైన ఇండియా.. ఇందులో భాగంగానే ఢిల్లీ రాంలీలా మైదానంలో మెగా ర్యాలీ నిర్వహిస్తోంది. కూటమిలోని 29 పార్టీలూ ఈ నిరసనలో పాల్గొంటున్నాయి. నకిలీ దర్యాప్తు పేరుతో గత రెండేళ్లుగా కేంద్రంలోని బీజేపీ టార్గెట్ చేసిందని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కర్ అన్నారు.
‘ఎటువంటి అధారాలు లేకుండా కొందరి నకిలీ ప్రకటనలతో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. ఇది మా పార్టీ గొంతు నొక్కాలనే కుట్రలో భాగం..ఎవరైతే బీజేపీని ప్రశ్నిస్తారో వాళ్లను జైల్‌లో వేయటమే వారి పని’అని ప్రియాంకా దుయ్యబట్టారు. ఇండియా కూటమి ర్యాలీకి బయలుదేరి ఝార్ఖండ్ సీఎం చంపై సోరెన్ మాట్లాడుతూ.. నియంతృత్వానికి స్వస్థి పలికి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని అన్నారు.
ఈ నిరసనల్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ సహా కీలకనేతల పాల్గొంటారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందన్న విపక్షాలు.. నేటి ర్యాలీలో ఇదే అంశాన్ని ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లనున్నాయి. ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్ (ఎన్సీపీ–ఎస్‌సీపీ), ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి సీతారాం ఏచూరి, డి.రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తదితరులు హాజరవుతున్నారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతకు ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ సతీమణి కల్పన సొరేన్ శనివారం సంఘీభావం తెలిపారు. శక్తివంతులైన మహిళలు కలవడంతో బీజేపీ భయపడి ఉంటుందని.. వీరిద్దరి సమావేశంపై ఢిల్లీ మంత్రి ఆతీషి ట్వీట్ చేశారు. సునీత కేజ్రీవాల్‌కు యావత్తు ఝార్ఖండ్ ప్రజానీకం అండగా ఉంటారని, తాము ఒకరి ఆవేదనను మరొకరం పంచుకున్నామని, కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించామని తెలిపారు.